Kaveri water: తమిళనాడుకు 3 వేల ఘనపుటడుగుల ‘కావేరి’ జలాలు
ABN , First Publish Date - 2023-09-30T08:37:20+05:30 IST
రాష్ట్రానికి సెకనుకు 3,000 ఘనపుటడుగుల చొప్పున అక్టోబరు 15వ తేది వరకు కావేరి జలాలు విడుదల చేయాలని కావేరి నిర్వాహక
- కర్ణాటకకు కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులు
- డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయ్
- సెకనుకు 12,500 ఘనపుటడుగుల జలాలు అవసరం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి సెకనుకు 3,000 ఘనపుటడుగుల చొప్పున అక్టోబరు 15వ తేది వరకు కావేరి జలాలు విడుదల చేయాలని కావేరి నిర్వాహక మండలి(kavery Management Board) శుక్రవారం కర్ణాటకను ఆదేశించింది. అయితే మండలి ఉత్తర్వులు జారీ చేసినా కర్ణాటక డ్యాంల నుంచి తమిళనాడు(Tamilnadu)కు నీటిని విడుదల చేసేందుకు ఆ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈనెల 18వ తేది జరిగిన కావేరి నిర్వాహక మండలి సమావేశంలో, తమిళనాడుకు 15 రోజుల వరకు 5,000 ఘనపుటడుగుల చొప్పున నీటి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, తమ రాష్ట్రంలోని డ్యాంలలో తగిన నీరు లేదంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనంటూ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీన జరిగిన కావేరి నిర్వాహక మండలి సమావేశం కూడా తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం మండలి సమావేశం జరిగింది.
12,500 క్యూసెక్కుల నీరు...
డెల్టా జిల్లాల్లో సాగు నీరందక వరి సహా పంటలన్నీ ఎండిపోతున్నాయని, వాటిని కాపాడే దిశగా సెకనకు 12,500 ఘనపుటడుగుల చొప్పున కావేరి నదీ జలాలను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు కోరారు. నీటి వనరుల శాఖ కార్యదర్శి డాక్టర్ మణివాసన్, కావేరి సాంకేతిక కమిటీ అధ్యక్షుడు ఎల్.సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మణివాసన్ మాట్లాడుతూ... డెల్టా జిల్లాలకు పదిహేను రోజులపాటు సెకనుకు 5వేల ఘనపుటడుగుల చొప్పున కర్ణాటక జలాశయాల నుంచి జలాలను విడుదల చేయాలని అటు సుప్రీంకోర్టు, ఇటు కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులు జారీ చేసినా కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తొలుత సెకనుకు 5వేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం సెకనుకు 1000 ఘనపుటడుగుల కంటే తక్కువగా విడుదల చేస్తోందని మండలి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం డెల్టా జిల్లాల్లోని 161 తాలూకాల్లో పండించిన వరి సాగునీరందక ఎండిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కర్ణాటక నుంచి విడుదల చేయాల్సిన జలాల్లో మూడింట ఒక భాగం కూడా సరఫరా కాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడేందుకు సెకనుకు 12,500 ఘనపుడుగుల చొప్పున జలాలను విడుదల చేయాలని కోరారు. అయితే కర్ణాటక అధికారులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డ్యాంలలో నీరు లేదని, కావేరి జలాలు విడుదల చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న నిర్వాహక మండలి.. అక్టోబరు 15వ తేది వరకు సెకనుకు 3,000 ఘనపుటడుగులు చొప్పున నీటిని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని ఆ రాష్ట్రంలోని విపక్ష పార్టీలు, రైతు సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం నిర్ణయం తీసుకుంటోందనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.