Kaveri waters: పరుగులిడుతున్న కావేరమ్మ
ABN , First Publish Date - 2023-09-01T07:51:08+05:30 IST
ఓ వైపు కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులు, మరో వైపు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కావేరి జలాల కోసం సుప్రీంకోర్టును
- డెల్టా జిల్లాలకు భారీగా జలాల విడుదల
- కర్ణాటక డ్యాముల నుంచి సెకనుకు 9 వేల ఘనపుటడుగులు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఓ వైపు కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులు, మరో వైపు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కావేరి జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం క్రమంగా తన పట్టును సడలించింది. ఆ రాష్ట్రంలోని కృష్ణరాజసాగర్, కబిని డ్యాంల నుంచి సెకనుకు 9.279 ఘటనపుటడుగుల చొప్పున జలాలను విడుదల చేస్తోంది. ఆ జలాలు హొగెనేకల్ జలపాతం, పులిగుండ్లు ప్రాజెక్టు మీదుగా మేట్టూరు డ్యాం(Mettur Dam)కు చేరనున్నాయి. ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు డెల్టా జిల్లాలకు సెకనుకు 15 వేల ఘనపుటుడుడుల చొప్పున జలాలను విడుదల చేయాలని కావేరి నిర్వాహక మండలి కర్ణాటకకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు జలాలను విడుదల చేయలేమని, కృష్ణరాజసాగర్, కబిని డ్యాంలలో నీటి నిల్వలను బట్టి జలాలను విడుదల చేస్తామని సదరు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గత మంగళవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) తమ జలాశయాల నుంచి స్వల్పపరిమాణంలో జలాలను విడుదల చేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం సెకనుకు 6,398 ఘనపుటడుగుల చొప్పున, గురువారం వేకువజాము నుంచి సెకనుకు 9,279 ఘనపుటడుగుల చొప్పున ఆ రెండు డ్యాంల నుంచి జలాలను విడుదల చేసింది. ఇదిలా ఉండగా కృష్ణరాజసాగర్, కబిని డ్యాంల నుంచి తమిళ రైతుల కోసం సాగుజలాలను విడుదల చేస్తున్నట్లు తెలుసుకున్న మండ్యా జిల్లాలకు చెందిన రైతులు ఆ డ్యాంల వద్ద నిరసన ప్రదర్శనలు ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.