Kavery waters: తలొగ్గిన కర్ణాటక ప్రభుత్వం.. ఎట్టకేలకు ‘కావేరి’ విడుదల
ABN , First Publish Date - 2023-09-24T09:06:19+05:30 IST
ఓ వైపు సుప్రీంకోర్టు, మరో వైపు కావేరి నిర్వాహక మండలి కావేరి డెల్టా జిల్లాల్లో పంటల సాగుకోసం కావేరి జలాలను విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) తలొగ్గింది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఓ వైపు సుప్రీంకోర్టు, మరో వైపు కావేరి నిర్వాహక మండలి కావేరి డెల్టా జిల్లాల్లో పంటల సాగుకోసం కావేరి జలాలను విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) తలొగ్గింది. శనివారం ఉదయం కర్ణాటక జలాశయాల నుంచి జలాలు విడుదల చేసింది. కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం తన పట్టును సడలించి జలాశయాల నుంచి నీటిని విడుదల చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని కబిని డ్యాం నుంచి సెకనుకు 2,500 ఘనపుటడుగులు చొప్పున, కృష్ణరాజసాగర్ డ్యాం నుంచి సెకనకు 2,973 ఘనపుటడుగుల చొప్పున మొత్తం 5,473 ఘనపుటడుగుల ప్రకారం కావేరి జలాలు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు జలాశయాల్లో ఇన్‌ఫ్లో కూడా విపరీతంగా పెరిగింది. కృష్ణరాజసాగర్‌లోకి సెకనుకు 5147 ఘనటపుటడుగులు, కబినిలోకి సెకనుకు 2796 ఘనపుటడుగుల చొప్పున జలాలు ప్రవేశిస్తున్నాయి. ఈ రెండు డ్యాంల నుంచి పదిహేను రోజులపాటు సెకనకు 5వేల ఘనపుటడుగుల చొప్పున జలాలను విడుదల చేయాలని కావేరి నిర్వాహక మండలి కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు డ్యాంల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలను విడుదల చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కావేరి జలాలు విడుదలయ్యాయని తెలియగానే డెల్టా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. తాము పండించి ఏపుగా పెరిగిన వరి తమ కళ్లెదుటే ఎండిపోతుందని ఆందోళన చెందిన ఆ రైతులంతా కావేరి జలాల రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.