KCR: సిసోడియా అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్!
ABN , First Publish Date - 2023-02-27T19:06:00+05:30 IST
మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్పందించారు.
హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR )స్పందించారు. సిసోడియా అరెస్ట్‌ను తాము ఖండిస్తున్నామన్నారు. అదానీ-మోదీ అనుబంధం (Adani Modi nexus) నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని ఫేస్‌బుక్ ద్వారా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మార్చి 4 వరకు కస్టడీకి అప్పగించింది. అంతకుముందు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సిసోడియాను ఐదు రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఎందుకు సిసోడియా రిమాండ్ అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సిసోడియాను ఇంకా విచారించాల్సి ఉందని, వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా సిసోడియా దాటవేశారని చెప్పారు. సిసోడియా ఒకేసారి పలు మొబైల్ ఫోన్లను మార్చి నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలు లేకుండా చేశారని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని చెప్పారు. లిక్కర్ పాలసీలో కమీషన్ను 5 నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపణలు చేశారు. కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు ప్రస్తావించారు.
మరోవైపు సిసోడియా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు ఆరోపణలతో రిమాండ్ అడుగుతున్నారని ఆరోపించారు.
ఇరు పక్షాల వాదనలు ముగిశాక ఆర్డర్‌ను రిజర్వ్‌లో ఉంచిన కోర్టు ఎట్టకేలకూ సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.
మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ సిసోడియాను నిన్న అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. సిసోడియా నిన్న ఉదయం 11.12 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆయనను ఈ కేసులో పలు అంశాలపై ప్రశ్నించారు.
దినేశ్ అరోరాతో పాటు ఇతర నిందితులతో సంబంధాలు, అనేక ఫోన్ల ద్వారా పంపిన, అందుకున్న మెసేజ్‌ల వివరాల గురించి అడిగామని అధికారులు తెలిపారు. సిసోడియా ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, ఆయన దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొన్నారు. తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా దాటవేశారని చెప్పారు. కాగా, ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన ప్రమేయం ఉందని సీబీఐ అరెస్టు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీసీ 120 బీ, 477 ఏ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద ఆయనను అరెస్టు చేశారు.
మరోవైపు ఇవాళ కూడా సీబీఐ కార్యాలయం వద్ద పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ ఆందోళనకు దిగిన పలువురు ఆప్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. వాస్తవానికి సీబీఐ సిసోడియాకు గత ఆదివారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నందున తనకు కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో విచారణ ఈ ఆదివారానికి వాయిదా వేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న సిసోడియాను గతేడాది అక్టోబరు 17న మొదటిసారి 9 గంటల పాటు ప్రశ్నించింది. నవంబరు 25న చార్జిషీట్ దాఖలు చేసినా... దాంట్లో సిసోడియా పేరు చేర్చలేదు. దినేశ్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్, ‘సౌత్ లాబీ’గా వ్యవహరిస్తున్న కోటరీలోని రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులను ప్రశ్నించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా సీబీఐ సిసోడియా కోసం విస్తృతమైన ప్రశ్నావళి తయారుచేసిందని తెలిసింది. ఇదే కేసులో గతేడాది డిసెంబరులో సీబీఐ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది. ఇటీవల కవిత మాజీ చార్టెర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ తమకు అనుకూలంగా రూపొందేలా కవితతో పాటు ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన పి.శరత్ చంద్రా రెడ్డితో కూడిన సౌత్ లాబీ మంత్రాంగం నడిపిందని, దాని తరఫున వ్యవహారాన్ని బుచ్చిబాబు చక్కబెట్టాడని సీబీఐ అభియోగం.
తదుపరి టార్గెట్ కవితేనా?
చార్జిషీట్లలో మనీశ్ సిసోడియా పేరు ఎక్కడా లేకపోయినా విచారణ పేరిట పిలిచిన సీబీఐ.. తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి టార్గెట్ కవితేనా!? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేశారు. ఆయనకు, కవిత కుటుంబంతో బంధుత్వం ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కే చెందిన, రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లెని అరెస్టు చేశారు. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టుబడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును ఇటీవలే అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి; వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి; ముత్తా గౌతమ్ తదితరులనూ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది.
శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కవిత, శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్ నాయర్ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూపునకు అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లె, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని వివరించింది. రాజకీయ నాయకులు తమ పేర్లను గోప్యంగా ఉంచడానికి బినామీలను ప్రయోగించారని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ సహా వీరందరినీ ఇప్పటికే సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. తాజాగా, చార్జిషీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సాక్షిగా కవితకు 160 సీఆర్‌పీసీ కింద డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి.. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే 7 గంటలకుపైగా విచారించారు.
అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ, ఇప్పటి వరకు కవితను మళ్లీ ప్రశ్నించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు వివరించాయి. గతంలో ఆమె ఇచ్చిన సమాచారం, అంతకుముందు, ఆ తర్వాత అరెస్టు చేసిన వారు ఇచ్చిన వివరాలు; దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. విచారణ అనంతరం సీబీఐ అధికారులు అవసరమైతే కవితను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని వివరించాయి. వెరసి, ఢిల్లీ మద్యం కేసులో జరుగుతున్న వరుస పరిణామాలు కవితకు ఇబ్బందికరంగానే మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.