Pinarayi Vijayan: ట్రిపుల్ తలాక్, సీఏఏపై సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-21T17:56:25+05:30 IST

ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్‌ పై నిషేధం విధిస్తూ కేంద్రం చేసిన చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు..

Pinarayi Vijayan: ట్రిపుల్ తలాక్, సీఏఏపై సీఎం సంచలన వ్యాఖ్యలు
https://www.dailymotion.com/embed/video/x8ihhso

తిరువనంతపురం: ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్‌ (Triple Talaq)‌పై నిషేధం విధిస్తూ కేంద్రం చేసిన చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు అనేవి అన్ని మతాల్లోనూ ఉంటాయని, అలాంటప్పుడు కేవలం ముస్లింలలో ట్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని ఆయన ప్రశ్నించారు. కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేదిలేదని అన్నారు.

కాసరగాడ్ జిల్లాలో సీపీఎం నిర్వహించిన కార్యక్రమంలో పినరయి విజయన్ ప్రసంగిస్తూ, శిక్ష అనేది మతం ప్రాతిపదికగా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండకూడదని అన్నారు. . ఇతర మతాల్లో విడాకుల కేసును సివిల్ కేసుగా చూస్తున్నప్పుడు, ఇస్లాంలోని ట్రిపుల్ తలాక్ అనేది క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ కేసుగా పరిగణిస్తూ, నేరంగా చూస్తున్నారని, ఇతర మతాల్లో మాత్రం ఇవి సివిల్ కేసులని అన్నారు. ఒక మతం అనుసరిస్తే ఒక చట్టం, మరో మతం వారికి మరో చట్టం ఉండవచ్చా అని నిలదీశారు.

సీఏఏ‌ను కేరళలో అమలు చేయం..

సిటిజన్‌షిప్ అమెండమెంట్ యాక్ట్ (CAA)ను కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని పినరయి విజయన్ స్పష్టం చేశారు. ''మనమంతా భారతదేశ పౌరులం. ఫలనా మతంలో పుట్టినందుకే పౌరసత్వం వస్తుందని ఎలా చెప్పగలం? పౌరసత్వానికి మతం ప్రాతిపదిక ఎలా అవుతుంది?'' అని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా సిటిజెన్‌షిప్ ఇచ్చేందుకు మతాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందన్నారు. రాష్ట్రంలో సీఏఏను అమలు చేసేది లేదని, గతంలో కూడా ఈ విషయం చెప్పానని అన్నారు.

కాగా, ట్రిపుల్ తలాక్‌పై పినరయి విజయన్ వ్యాఖ్యలను బీజేపీ ప్రతినిధి టామ్ వడక్కన్ ఖండించారు. ట్రిపుల్ తలాక్‌కు, కోర్టులో విడాకులకు జరిగే సాధారణ సివిల్ ప్రొసీజర్‌కు ఉన్న తేడాను ముందుగా సీఎం తెలుసుకోవాలని అన్నారు. రెండింటికీ పోలికే లేదని చెప్పారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపంచారు.

Updated Date - 2023-02-21T17:56:27+05:30 IST