Share News

Chhattisgarh Assembly Elctions: కాంగ్రెస్ అందరి హృదయాల్లోనూ ఉంది, గెలుపు మాదే: ఖర్గే

ABN , First Publish Date - 2023-11-03T20:51:12+05:30 IST

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ) కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరి హృదయాల్లోనూ ఉందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ పార్టీ ఉంటుందన్నారు.

Chhattisgarh Assembly Elctions: కాంగ్రెస్ అందరి హృదయాల్లోనూ ఉంది, గెలుపు మాదే: ఖర్గే

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Chattisgarh Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరి హృదయాల్లోనూ ఉందని చెప్పారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉందని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని, ఆ కారణంగానే ప్రజలను కాంగ్రెస్‌ను గెలిపించాలని అనుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేసిందేమీ లేదని బీజేపీ చెబుతోందని, కాంగ్రెస్ చేసిందేమీ లేకపోతే మోదీ ప్రధాని గాని, అమిత్‌షా హోం మంత్రి కానీ అయ్యేవారే కాదని చురకలు చేశారు. ఈదేశ రాజ్యంగాన్ని కాపాడామని, ఆ కారణంగానే మీరు (మోదీ, అమిత్‌షా) ఆ కుర్చీల్లో ఉన్నారని అన్నారు.


అమిత్‌షా చురకలు..

మరోవైపు, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోం మంత్రి శుక్రవారంనాడు పండారియా నియోజకవర్గంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కాంగ్రెస్‌కు 'ప్రీపెయిడ్ సీఎం' అని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఎటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు పెరిగిపోతుంటాయని, రాజ్యాంగం ప్రతి మనిషికి తమకు నచ్చిన మతవిశ్వాసాలు పాటించే హక్కు ఇచ్చినప్పటికీ పేద గిరిజనుల మతమార్పిడికి రాష్ట్ర యంత్రాగాన్ని కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లలో పూర్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ను తీర్దిదిద్దుతామని హామీ ఇచ్చారు.


తొంభై అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడతగా నవంబర్ 7న 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. తక్కిన 70 నియోజకవర్గాల్లో నవంబర్ 17న తుది విడత పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు 68 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. మాజీ సీఎం అజిత్ జోగి సారథ్యంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) 5 సీట్లు, బీఎస్‌పీ 2 సీట్లు గెలుచుకున్నాయి.

Updated Date - 2023-11-03T20:56:17+05:30 IST