Khushbu: సినీనటి, బీజేపీ నేత ఖుష్పూ సంచలన కామెంట్స్.. అవినీతిని కప్పిపుచ్చేందుకే గవర్నర్ పేరుతో కపట నాటకం
ABN , First Publish Date - 2023-11-19T07:29:26+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై డీఎంకే ప్రభుత్వం తక్షణమే అత్యవసర అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి మళ్లీ వాటిని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై డీఎంకే ప్రభుత్వం తక్షణమే అత్యవసర అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి మళ్లీ వాటిని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఖుష్బూ(Khushbu) ధ్వజమెత్తారు. చట్ట సవరణ ముసాయిదా బిల్లులను సక్రమంగా ప్రతిపాదించి ఉంటే గవర్నర్ వాటికి తప్పకుండా ఆమోదం తెలిపి ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు. చెన్నైలో శనివారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... డీఎంకే ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పేరుతో ఆ పార్టీ కపటనాటకమాడుతోందని విమర్శించారు. తాము చేస్తున్న అవినీతి భాగోతం ఎక్కడ భయపడుతుందోన్న భయంతోనే గవర్నర్‌కు వ్యతిరేకంగా డీఎంకే(DMK) పోరాటం సాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే బిల్లులను ప్రతిపాదించకుండా తన కుటుంబీకులకు, మంత్రులకు మాత్రమే ప్రయోజనం కలిగించే బిల్లులను పంపితే గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం పంపే ప్రతిబిల్లును ఆమోదించడానికి గవర్నర్ తహసీల్దార్ పనులు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో, మంత్రులు నివసిస్తున్న ప్రాంతాలలో మాత్రమే పటిష్టమైన దారులు ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాంల్లో మిట్టాపల్లాలుగా, గోతులతో రహదారులన్నీ దుస్థితికి చేరుకున్నాయన్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని డీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు చక్కటి గుణపాఠం చెబుతారని ఖుష్భూ పేర్కొన్నారు.