KMF: కేఎంఎఫ్‌లో జాబ్స్ ఫర్ సేల్.. నో ఇంటర్వ్యూ, నో టెస్ట్
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:17 PM
కర్ణాటక రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంస్థ(కేఎంఎఫ్)లో ఉద్యోగాల భర్తీకి తెర లేచింది. కాని ఇందులో పోస్టుకు ఇంత అని ముందుగానే అమ్మకాలకు సిద్దమయినట్టు తెలుస్తోంది.
- పోస్టుకు రూ. లక్షల్లో వసూళ్లు
- న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిరుద్యోగులు
- నిబంధనలు పాటించాల్సిందే: కోర్టు
- లబోదిబోమంటున్న అభ్యర్థులు
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంస్థ(కేఎంఎఫ్)లో ఉద్యోగాల భర్తీకి తెర లేచింది. కాని ఇందులో పోస్టుకు ఇంత అని ముందుగానే అమ్మకాలకు సిద్దమయినట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటిస్తున్నటు రికార్డుల్లోనే చూపుతూనే ఉద్యోగాలన్నీ ముందుగా భర్తీ చేయడానికి సిద్దమయ్యారు. దీన్ని గుర్తించిన కొందరు నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా నిబంధనలు పాటించకుండా పోస్టులు భర్తీ చేస్తే, అలాంటి నియమాకాలు చెల్లవని ఉత్తర్వులు జారీ చేసింది.
బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు(బ.వి.కో.రా) జిల్లాల పరిధిలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) పనిచేస్తుంది. కేఎంఎఫ్‌లో మొత్తం 60 ఉద్యోగాల భర్తీకి నవంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబరు 8 నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. డిసెంబరు 31 న రాతపరీక్షలు పూర్తిచేయాలి. 200 మార్కులకు ఉండే ఈ పరిక్షలో క్యాలీఫై అయిన వారి నుంచి 1: 5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్య్వూలకు పిలచి క్యాలిఫై అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. డిప్యూటీ మేనేజర్(స్టోరేజ్), అసిస్టెంట్ మేనేజర్(ఎంఐఎస్) వేర్‌హౌసింగ్ అఫీసర్, డ్రైవర్స్, పీఆర్‌వో ఇలా 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడి నుండి అక్రమాలకు తెర లేచింది. దరఖాస్తు చేసిన అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని పోస్టులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులతో పాటు మిగిలిన కొన్ని పోస్టులకు ముడుపులు ముందే తీసుకుని పోస్టులను అమ్మేస్తున్నారని సమాచారం. అసలు నిబంధనలు పాటించకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్టుల భర్తీకి వారి జీతాన్ని బట్టి రేటు నిర్ణయించారు. ఉదాహరణకు నెలకు రూ.50 వేలు జీతం ఉన్న పోస్టుకు రూ. 10 లక్షలు ముందే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించారని సమాచారం. కేఎంఎఫ్‌లో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి ఈ పోస్టుల అమ్మకం వ్యవహారాన్ని అంతా తానే చూసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు పరీక్షలు రాయకుండా ఫలితాలు వెల్లడించకుండా ఇంటర్య్వూ చేయకుండానే పోస్టులు మీకే అని కొందరు బహిరంగాంగా అమ్మకాలకు తెర లేపారని సమాచారం. ఈ విషయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు ముడుపులు ఇవ్వలేక పోతున్నామని నిరాశచెందుతున్నారు. మరి కొందరు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కేఎంఎఫ్‌లో ఉద్యోగాలు నిబంధన ప్రకారం భర్తీ చేయడం లేదని నిబంధనలు ఒక లా ఉంటే నియామకం మరోలా చేస్తున్నారని కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై కోర్టు కేఎంఎఫ్‌లో ఉద్యోగాల భర్తీ నిబంధనల ప్రకారం చేయాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? వాటి నిబంధనలేమిటి? అర్హతలు తదితర అన్నింటిపై తమకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే కొందరు దరఖాస్తు దారులు పోస్టు కోసం ముడుపులు ఇచ్చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు డబ్బులు తీసుకున్న వ్యక్తితో గురువారం గొడవకు దిగినట్లు సమాచారం.
అలాంటిదేమీ లేదు: కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతయ్య
కేఎంఎఫ్‌లో ఉద్యోగాల భర్తీ నిజమేనని కెఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతయ్య తెలిపారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణల విషయంపై వివరణ కోరగా అలాంటిదేమీ లేదని తిరుపతయ్య చెప్పారు.