KPCC: కేపీసీసీకి వచ్చే వారమే కొత్త జట్టు

ABN , First Publish Date - 2023-08-30T11:15:06+05:30 IST

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(Karnataka Pradesh Congress Committee)కి

KPCC: కేపీసీసీకి వచ్చే వారమే కొత్త జట్టు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(Karnataka Pradesh Congress Committee)కి కొత్త జట్టును సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం స్వయంగా చొరవ తీసుకుని పార్టీని లోక్‌సభ ఎన్నికల విజయపథంలో నడిపించే నేతల అన్వేషణలో నిమగ్నమై ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjuna Kharge) ఇప్పటికే కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(KPCC President and Deputy Chief Minister DK Shivakumar)తో నూతన పదాధికారుల కూర్పు, మార్పు, చేర్పులపై చర్చించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు మొదటివారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు కేపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత కార్యాధ్యక్షులలో నలుగురిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. అలాగే 35 మంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో సగానికిపైగా కొత్తవారికి పగ్గాలు అప్పగించనున్నారు.

pandu3.2.jpg

20 జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను కూడా కొత్తగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేపీసీసీ కార్యాధ్యక్షులుగా ఉన్న సతీశ్‌ జార్కిహొళి, ఆర్‌ రామలింగారెడ్డి, ఈశ్వర్‌ఖండ్రె, సలీం అహ్మద్‌ను ఈ పదవుల నుంచి తొలగించనున్నట్టు సమాచారం. వీరిలో మొదటి ముగ్గురు సిద్దరామయ్య కేబినెట్‌లో మంత్రులుగా ఉండగా సలీం అహ్మద్‌ విధానపరిషత్‌లో చీఫ్‌ విప్‌గా కేబినెట్‌ హోదా కలిగి ఉన్నారు. కేపీసీసీ కార్యాధ్యక్ష పదవులను లింగాయత, ముస్లిం, బీసీ నేతలతో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేపీసీసీలో తమ వర్గానికి చోటు కల్పించే దిశలో ఇటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం, అటు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వర్గం తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-08-30T11:20:21+05:30 IST