Karnataka Congress: కాంగ్రెస్ అధిష్టానం ముందు మరో మడత పేచీ.. సీఎం సీటు వదులుకున్నందుకు డీకే అడుగుతున్నదేంటంటే..

ABN , First Publish Date - 2023-05-18T17:46:04+05:30 IST

డిప్యూటీ సీఎం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, తనకు ఆర్థిక శాఖ కేటాయించాల్సిందిగా డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య వ్యతిరేకించినట్లు సమాచారం.

Karnataka Congress: కాంగ్రెస్ అధిష్టానం ముందు మరో మడత పేచీ.. సీఎం సీటు వదులుకున్నందుకు డీకే అడుగుతున్నదేంటంటే..

బెంగళూరు: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రిపై (Karnataka CM Row) నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా (Siddaramaiah), డీకే శివకుమార్‌ను (DK Shivakumar) ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో కర్ణాటకకు చెందిన ఈ కాంగ్రెస్ ముఖ్య నేతలిద్దరూ ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యను డిసైడ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానానికి (Congress High Command) తల ప్రాణం తోకకొచ్చినట్టయింది. దాదాపు నాలుగు రోజుల పాటు నానా తిప్పలు పడి సీఎం సీటుపై ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటన చేసింది. ఇప్పుడు కొత్త కేబినెట్ ఏర్పాటు కాంగ్రెస్ అధిష్టానానికి మరో పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు డీకేకు ఏం చెప్పి ఒప్పించారో తెలియదు గానీ మంత్రివర్గంలో తాను చెప్పిన మనుషులకు, తాను కోరుకున్న శాఖలు కేటాయించకపోతే డీకే నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదు.

dkshiv.jpg

తాజాగా మంత్రి వర్గ ఏర్పాటుపై అందుతున్న సమాచారం ఏంటంటే.. డిప్యూటీ సీఎం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, తనకు ఆర్థిక శాఖ కేటాయించాల్సిందిగా డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య వ్యతిరేకించినట్లు సమాచారం. అవసరమైతే ఇతర ఏ శాఖనైనా కేటాయించాలని, సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖను తానే చూసుకుంటానని సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

dk1.jpg

కాంగ్రెస్ హైకమాండ్ డీకేకు రెండు కీలక శాఖలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పట్టణాభివృద్ధి శాఖ, నీటి పారుదల శాఖను డీకేకు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే.. తనకు ఆర్థిక శాఖ కావాలని డీకే శివకుమార్ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి మరో తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రి పదవినే వదులుకున్న కేపీసీసీ ప్రెసిడెంట్‌కు కోరిన శాఖను కూడా కేటాయించకపోతే డీకే నుంచి, అతని వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అధిష్టానం భావిస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. ఒక గండం తప్పిందని హమ్మయ్య అనుకునే లోపే మంత్రివర్గ ఏర్పాటు రూపంలో మరో గండం ముంచుకొస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

2SIDDARAMAIAH.gif

కర్ణాటకలో పవర్ షేరింగ్ విషయంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పవర్ షేరింగ్ ఫార్ములాపై డీకేను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తామందరం చర్చించుకున్న కీలక సమాచారాన్ని బయటపెట్టాలని తాను భావించడం లేదని చెప్పారు. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారని డీకే శివకుమార్ పవర్ షేరింగ్ ఫార్ములాపై సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉండగా.. పవర్ షేరింగ్‌పై ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే.. మొదటి రెండేళ్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారికంగా ఈ ప్రకటన రాకపోయినప్పటికీ ఇప్పటికి ఉన్న సమాచారం అయితే ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2013 నుంచి 2018 వరకూ సిద్ధరామయ్య కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Updated Date - 2023-05-18T18:15:32+05:30 IST