KTK: నాడు వైరం.. నేడు స్నేహం.. బద్దశత్రువుల మధ్య కుదిరిన సయోధ్య
ABN , First Publish Date - 2023-10-06T12:52:47+05:30 IST
రాజకీయంగా సుధీర్ఘకాలం పాటు బద్దశత్రువులుగా కొనసాగిన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి
- సీపీ యోగీశ్వర్‌కు కుమార మద్దతు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజకీయంగా సుధీర్ఘకాలం పాటు బద్దశత్రువులుగా కొనసాగిన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy), బీజేపీ నేత మాజీ మంత్రి సీపీయోగీశ్వర్(Former minister CP Yogeshwar)ల మధ్యన రాజకీయంగా వైషమ్యాలు ఉన్నాయి. ఇద్దరూ చెన్నపట్టణ నుంచి పోటీపడి తీవ్రంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా ఇద్దరూ పలు ఎన్నికలలలో తలపౄడుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ- జేడీఎస్(BJP-JDS)ల మధ్యన పొత్తు ఖరారు కావడంతో బద్దశత్రువులు ఒక్కటి కావాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఎన్నికలలో చెన్నపట్టణ నుంచి ఓడిన యోగీశ్వర్ రానున్న లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు గ్రామీణ నుంచి పోటీ చేయదలచారు. ఒక వేళ టికెట్ ఇస్తే కుమారస్వామి మద్దతు అనివార్యం కానుంది. చెన్నపట్టణ, రామనగర్‌తో పాటు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జేడీఎస్ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. టికెట్ ఖరారయ్యాక స్నేహం కోరితే పరిస్థితి ఎలా ఉంటుందో అని యోగీశ్వర్ చేసిన ప్రయత్నం ఫలించినట్లు అయ్యింది. మాగడి మాజీ ఎమ్మెల్యే మంజు ఇరువురితో వేర్వేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. యోగీశ్వర్‌కు టికెట్ దక్కితే తప్పకుండా కలిసి పనిచేస్తానని కుమారస్వామి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీ నిని బట్టి చూస్తే డీసీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar)తో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ ను ఢీకొనేందుకు బద్దశత్రువులైన కుమారస్వామి, సీపీయోగీశ్వర్‌లు ఒక్కటవుతున్నారు.