India-America: చైనాకు చెక్ పెడదాం!
ABN , First Publish Date - 2023-09-09T03:15:44+05:30 IST
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ప్రదర్శనలను(China's dominance shows), ఏకపక్ష ధోరణులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్-అమెరికా(India-America) నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించాయి.
స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కృషి చేద్దాం
ఇందుకు క్వాడ్ బలోపేతమే మార్గం.. మోదీ, బైడెన్ సంయుక్త నిర్ణయం
ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు.. పలు రంగాల్లో సహకారానికి నిర్ణయం
ఉమ్మడి ప్రకటన విడుదల.. వచ్చే ఏడాది ఐఎ్‌సఎ్‌సకు కలిసికట్టుగా ప్రయాణం
మానవ సహిత అంతరిక్ష యాత్రకు కసరత్తు.. భారత సైన్యానికి రిమోట్ విమానాలు
5జీ, 6జీలపై ఉమ్మడి పరిశోధన.. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ప్రదర్శనలను(China's dominance shows), ఏకపక్ష ధోరణులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్-అమెరికా(India-America) నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించాయి. దీనికోసం క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్)ను బలోపేతం చేయాలని తీర్మానించాయి. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో(G20 Summit) పాల్గొనటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో దిగీదిగగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) అధికారిక నివాసానికి బైడెన్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిని మోదీ సాదరంగా స్వాగతించారు. అనంతరం వారిరువురూ ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు. గంటకుపైగా విద్య, వైద్యం, రక్షణ, అంతరిక్షం, టెక్నాలజీ తదితర రంగాలపై సమగ్రంగా చర్చించారు. వారి చర్చల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం కీలక అంశంగా ముందుకొచ్చింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అక్కడి సముద్ర జలాల్లో చైనా సైన్యం బలప్రదర్శనలకు దిగటం, పొరుగు దేశాలకు ఆందోళన కలిగించేలా వ్యవహరించటంపై మోదీ, బైడెన్ మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమి చైనాను నిలువరించటానికి చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలని నేతలిద్దరూ నిర్ణయించారు. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. తద్వారా ఆ ప్రాంతంలో అన్ని దేశాల వాణిజ్యం, రాకపోకలు స్వేచ్ఛగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భారత్-అమెరికా నిర్ణయించినట్లయ్యింది. వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశాలకు బైడెన్‌ను మోదీ ఆహ్వానించారు. ఇండో-పసిఫిక్ ఒషెన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ)లో చేరాలన్న అమెరికా నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. మోదీ, బైడెన్ ద్వైపాక్షిక భేటీ అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన వెలువడింది. నేతల చర్చలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ ప్రకటనలో వెల్లడించారు. ఆ వివరాలు..
ఇరు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలను కొనసాగించాలి. తద్వారా భారత్-అమెరికా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలి. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు, ప్రపంచ అభివృద్ధికి తోడ్పడాలి. ఆర్థికరంగంలోనేగాక ఇరుదేశాల ప్రజల మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటం ద్వారా ప్రపంచంలో మంచి మార్పులకు భారత్, అమెరికా చోదకశక్తులుగా పని చేయాలి.
అంతరిక్ష పరిశోధనల రంగంలో పరస్పర సహకారాన్ని కొనసాగించాలి. వచ్చే ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎ్‌సఎస్) ఇరు దేశాలు కలిసి వెళ్లే ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఏడాది ఆఖరుకు మానవ సహిత అంతరిక్ష యాత్రను కలిసి చేపట్టటంపై కసరత్తును కొనసాగించాలి.
రక్షణ రంగంలో పరస్పర సహకారానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా రోదసి, కృత్రిమ మేధో రంగాలకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించాలి. భారత సైన్యానికి రిమోట్‌తో నడిపించే నిఘా విమానాలను అందించే ప్రతిపాదనపై అమెరికా పరిశీలన జరుపుతుంది. జీఈ ఎయిరోస్పేస్, హెచ్‌ఏఎల్ సంయుక్తంగా భారత్‌లో జీఈ ఎఫ్-414 యుద్ధవిమానాల ఇంజిన్ల తయారీని చేపడుతాయి. రక్షణరంగంలో ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవటానికి స్టార్ట్‌పలను అభివృద్ధి చేయాలి.
అణుశక్తి రంగంలో పరస్పరం కలిసి పని చేయాలి. భారత్‌లో పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. దీంట్లో భాగంగా భారత్‌లో పదివేల ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి చర్యలు. పునరుత్పాదక వనరుల వినియోగాన్ని ప్రోత్సహించటానికి అమెరికా, భారత్ చెరో 50 కోట్ల డాలర్లతో నిధిని ఏర్పాటు చేస్తాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా డబ్ల్యూటీవో చివరి, ఏడవ వివాద పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
టెక్నాలజీ రంగంలో భారత్ సాధిస్తున్న విజయాల నేపథ్యంలో, కీలకమైన, కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీల విషయంలో పరస్పరం సహకరించుకోవాలి. ముఖ్యంగా పరస్పర విలువలను, ప్రజాస్వామ్య సంస్థలను పునాదిగా చేసుకొని ‘ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ’ (ఐసెట్)పై దృష్టి పెట్టాలి. ఐసెట్‌పై వచ్చే ఏడాది ప్రారంభంలో సమీక్ష జరపాలి. గ్లోబల్ సెమికండక్టర్ పంపిణీ వ్యవస్థల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. టెలికాం రంగంలో 5జీ, 6జీ టెక్నాలజీల అభివృద్ధిపై ఇరుదేశాల కంపెనీలు పరస్పరం సహకరించుకునేలా చర్యలు చేపట్టాలి.
ఇరుదేశాల మధ్య విద్యారంగంలో ఇప్పటికే బలంగా ఉన్న సంబంధాలను మరింత పటిష్ఠపరచాలి. ఐఐటీల మండలి, అమెరికా వర్సిటీల అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు భారత్-అమెరికా గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. దీంట్లో అత్యున్నతస్థాయి పరిశోధనలు నిర్వహించాలి.
అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు ఇదే తొలిసారి
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత బైడెన్ భారతదేశ పర్యటనకు రావటం ఇదే తొలిసారి. 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించారు. ద్వైపాక్షిక భేటీలో మోదీతోపాటు భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనగా, అమెరికా నుంచి బైడెన్‌తోపాటు అమెరికా మంత్రులు జానెల్ యెల్లెన్, ఆంథొని బ్లింకెన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ పాల్గొన్నారు. రెండురోజుల జీ 20 సమావేశాల సందర్భంగా వివిధ దేశాలతో మోదీ 15 ద్వైపాక్షిక సమావేశాల్ని నిర్వహించనున్నారు. వీటి ద్వారా ఆయా దేశాలతో భారత్‌కున్న సంబంధాలను ఓసారి సమీక్షించుకోవటంతోపాటు, మరింత బలోపేతం చేసే అవకాశం లభిస్తుందని మోదీ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు
ప్రపంచ పాలన మరింత ప్రాతినిధ్యంతో కూడుకొని ఉండాలని, మరింత సమ్మిళితంగా ఉండాలని బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న డిమాండ్‌కు అమెరికా మద్దతును పునరుద్ఘాటించారు. 2028-29లో భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ అభ్యర్థిత్వాన్ని ఆయన స్వాగతించారు.
బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
జి-20 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జి-20 వర్కింగ్ గ్రూప్‌లు, మినిస్టీరియల్ సమావేశాల్లో మారిషస్ పోషిస్తున్న చురుకైన పాత్రను మోదీ కొనియాడారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. హసీనాతో సమావేశంలో రాజకీయపరమైన అంశాలతో పాటు భద్రతా సహకారం, సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, నీటి వనరులు, విద్యుత్తు, ఇంధనం, సాంస్కృతిక, ప్రజా సంబంధాలను విస్తృత స్థాయిలో చర్చించారు. ఉపఖండంలో ఇటీవల పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి.