Aero India 2023: ఏరో ఇండియాలో మళ్లీ ప్రత్యక్షమైన హనుమంతుడి లోగో

ABN , First Publish Date - 2023-02-17T18:56:53+05:30 IST

ఏరో ఇండియా 2023 చివరి రోజైన శుక్రవారంనాడు హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ విమానంపై ..

Aero India 2023: ఏరో ఇండియాలో మళ్లీ ప్రత్యక్షమైన హనుమంతుడి లోగో

బెంగళూరు: ఏరో ఇండియా 2023 (Aero India 2023) చివరి రోజైన శుక్రవారంనాడు హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (HLFT)-42 విమానంపై లార్డ్ హనుమాన్ లోగో (Lord Hanuman Logo) తిరిగి ప్రత్యక్షమైంది. బెంగళూరు ఏరో షోలో మొదటి రోజు హనుమంతుడి లోగోను ప్రదర్శించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఆ తర్వాత తొలగించడం చర్చకు కూడా దారితీసింది. ఈ క్రమంలోనే చివరిరోజు మరోసారి హనుమంతుడి లోగోతో ఉన్న హెచ్ఎల్ఎఫ్‌టీ-42ను హెచ్ఏఎల్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇండోర్ పెవిలియన్ వద్ద ప్రదర్శనకు ఉంచారు.

ఈనెల 13వ తేదీన ఏరో ఇండియా ప్రదర్శనలో హెచ్ఎల్ఎఫ్‌టీ-42 విమానంపై ఉన్న హనుమాన్ లోగో పలువురుని ఆకర్షించింది. అయితే కాంక్లేవ్ రెండవ రోజే ఆ లోగో మాయమైంది. దీనిపై హెచ్ఏఎల్ వివరణ కూడా ఇచ్చింది. తొలుత విమానంపై హనుమాన్ లోగో కింద వ్యూహాత్మకంగా ఒక స్లోగన్‌ను హెచ్ఎఎల్ ఏర్పాటు చేసింది. ''ది స్టార్మ్ ఈజ్ కమింగ్'' అంటూ క్యాప్షన్ పెట్టింది. హెచ్ఎల్‌ఎఫ్‌టీ-42 ఎంత శక్తివంతమైన విమానమో చెప్పేందుకే హనుమాన్ లోగోను ఏర్పాటు చేశామని, అయితే అంతర్గత చర్చల అనంతరం దానిని తొలగించాలని తాము నిర్ణయించామని హెచ్ఏఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డీకే సింగ్ వివరణ ఇచ్చారు. ఈ విమానం 'నెక్ట్స్ జనరేషన్ సూపర్ సోనిక్ ట్రైనర్' అని, ఇది అధునాతన పోరాట విమానమని, ఇందులో దేశీయంగా తయారైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ వేర్ సూట్, సెర్చ్ అండ్ ట్రాక్ కోసం వైర్ కంట్రోల్ సిస్టం సహా అనేత సౌకర్యాలున్నాయని హెచ్ఏఎల్ తెలిపింది.

మిలటరీ ఆపరేష్లన్లు, పరికరాలకు దేవుళ్ల పేర్లు పెట్టడంలో భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌కు ''బాల్ బజ్‌రంగ్ బలి కి జై'' (హనుమాన్ విజయం) అనే పేరు పెట్టడం దగ్గర నుంచి, హెచ్ఏఎల్ ఎయిర్‌క్రాప్ట్‌కు హెచ్‌-24 మారుత్ అనే పేరు పెట్టడం వరకూ అనేక ఉదాహరణలు ఉన్నాయి.

Updated Date - 2023-02-17T18:56:56+05:30 IST