Ajit meets Pawar: కుటుంబ సన్నిహితుని ఇంట్లో కలిసిన పవార్ ద్వయం... మళ్లీ ఊహాగానాలు

ABN , First Publish Date - 2023-08-12T21:01:47+05:30 IST

నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్‌ ను ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారంనాడు కలుసుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత జూలై 2న ఎన్‌సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ అదేరోజు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

Ajit meets Pawar: కుటుంబ సన్నిహితుని ఇంట్లో కలిసిన పవార్ ద్వయం... మళ్లీ ఊహాగానాలు

పుణె: నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) సుప్రీం శరద్ పవార్‌ (Sharad pawar)ను ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) శనివారంనాడు కలుసుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత జూలై 2న ఎన్‌సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ అదేరోజు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన వర్గానికి చెందిన మరో 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అసలైన ఎన్‌సీపీ తనదేనని, పార్టీ పేరు, గుర్తు కూడా తనదేనని ప్రకటించారు. శరద్ పవార్ ఈ వాదనను కొట్టివేస్తూ, గతంలో కూడా ఎన్‌సీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని, మళ్లీ పార్టీకి జవసత్వాలు తీసుకువస్తానంటూ రాష్ట్రంలో పార్టీ ప్రచారం కూడా సాగించారు. ఈ నేపథ్యంలో పుణెలోని కొరేగావ్ పార్క్‌లో ఉన్న వ్యాపారవేత్త అతుల్ చోరడియా నివాసంలో పవార్ ద్వయం శనివారం కలుసుకున్నారు. పవార్ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడుగా చోరడియాకు పేరుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సమావేశం ఎజెండా?

శరద్ పవార్, అజిత్ పవార్‌ సమావేశం వెనుక ఎజెండా ఏమిటనేది ఇప్పటికైతే స్పష్టం కాలేదు. అయితే, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌ బెయిలు, ఎన్డీయే సమావేశంలో అజిత్ పవార్ పాల్గొనడం, పార్టీకి చెందిన అంశాలపై ఉభయులూ మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ పవార్‌ను అజిత్ పవార్‌ కలుసుకున్నారనే సమాచారం బయటకు రావడంతో పవార్ క్యాంప్‌లోని ఎమ్మెల్యేల్లో అలజడి కనిపిస్తోందని చెబుతున్నారు.


బీజేపీతో చేతులు కలిపేది లేదు...

కాగా, బీజేపీతో చేతులు కలిపేది లేదని ఇంతకుముందు శరద్ పవార్ తమ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని కూడా కోరారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-12T21:02:32+05:30 IST

News Hub