Maratha community Quota: రిజర్వేషన్ మంటలు.. లాతురులో తాజా నిరసనలు

ABN , First Publish Date - 2023-09-09T21:25:53+05:30 IST

మరాఠా కమ్యూనిటీకి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా లాతూరు లో శనివారంనాడు నిరసనలు చోటుచేసుకున్నాయి.

Maratha community Quota: రిజర్వేషన్ మంటలు.. లాతురులో తాజా నిరసనలు

లాతూరు: మరాఠా కమ్యూనిటీకి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా లాతూరు (Latur) లో శనివారంనాడు నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని 'మాక్ ఫ్యునిరల్' కోసం ఆందోళనకారులు తమతో తెచ్చుకున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిరసన కారులు పేపర్లు, ఇతర వస్తువులతో మంటలు (bonafire) వేసి నిరసన వ్యక్తం చేశారు.


మరాఠా కమ్యూనిటీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేష్టలుడిగి చూస్తున్నారని, రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ డిమాండపై తాము ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చిందని, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ క్లాసులు స్వచ్ఛందంగా బంద్ చేశారని మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్త ఒకరు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్న ఆందోళనకారులపై సెప్టెంబర్ 1న జల్నా జిల్లాలో పోలీసులు లాఠీచార్జి చేయడం సంచలనమైంది. ఆందోళనకారులు హింసకు దిగడంతో 40 మంది పోలీసు సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. 15 రాష్ట్ర రవాణా బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీచార్జి జరపడంపై ప్రజలకు ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చర్చలు ప్రారంభించడం, క్రమరీతిలో రిజర్వేషన్లు సాధించుకునేందుకు ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.


ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి సుప్రియ సూలే పిలుపు

కాగా, మరాఠా రిజర్వేషన్లు, కరవు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జల్నా ఘటనపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ సుప్రియ సూలే డిమాండ్ చేశారు. ప్రజల బాధలను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని అన్నారు.

Updated Date - 2023-09-09T21:30:03+05:30 IST