Metro Trains: మెట్రో ప్రయాణికులకు శుభవార్త... 25 శాతం రాయితీ
ABN , First Publish Date - 2023-04-29T18:59:37+05:30 IST
ముంబైవాసులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 1వ తేదీ నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టిక్కెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ..
ముంబై: ముంబైవాసులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 1వ తేదీ నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టిక్కెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ప్రకటించింది. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, 12వ తరగతి వరకూ విద్యార్థులు మెట్రో లైన్ 2A, 7లో ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపింది. మే 1వ తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కానుకను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శనివారంనాడు ప్రకటించారు. నేషనల్ మొబిలిటీ కార్డు (ముంబై వన్) ఉన్న వేలాది మందికి కూడా ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
రాయితీ ఎలా పొందాలి?
ప్రభుత్వం ప్రకటించిన రాయితీని ఉపయోగించుకోవాలంటే దివ్యాంగులు తగిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ లేదా ప్రభుత్వ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు వయో నిర్ధారణ ఆధారాలు చూపించాలి. విద్యార్థులు తమ పాన్ కార్డు కానీ, తల్లిదండ్రుల పాన్ కార్డులు కానీ స్కూలు ఐడీతో సహా చూపించాలి. లైన్ 2A, 7 రూట్లలో వీటిని చూపించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర రవాణా బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం, మహిళలకు టిక్కెట్లలో 50 శాతం రాయితీతో ప్రయాణించే సౌకర్యం తమ ప్రభుత్వం కల్పిస్తోందని షిండే తెలిపారు.