Maharashtra Violence: రామ నవమి అల్లర్లలో 20 మంది అరెస్టు
ABN , First Publish Date - 2023-03-31T13:48:51+05:30 IST
మహారాష్ట్రలోని మలద్ ప్రాంతంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి..
ముంబై: మహారాష్ట్రలోని మలద్ ప్రాంతంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి 20 మందిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. అలర్లకు పాల్పడిన ఆరోపణలపై వీరిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. గురువారం రాత్రి సబర్బన్ మలద్ (పశ్చిమ)లోని మల్వని వద్ద శ్రీరామ నవమి ఊరరేగింపు జరుగుతుండగా, డీజే సౌండ్, దాని వెనుకే లౌడ్ మ్యూజిక్ ఏర్పాటుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. స్థానిక రాజకీయ నేతలు, సీనియర్ పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని ప్రజలను ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఔరంగాబాద్‌లోనూ...
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ (ఔరంగాబాద్)లోనూ గురువారం సాయంత్రం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కిరద్‌పుర ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఆందోళనకారులు పోలీసు టీమ్‌పై దాడి చేయడంతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. రామనవమి, రంజాన్ మాసం కావడంతో ఈ అల్లర్లు మత ఘర్షణలకు దారి తీయకుండా పోలీసులను భారీ ఎత్తున రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. ఈ దాడుల ఘటనలో 500 నుంచి 600 మంది వరకూ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసు కమిషనర్ నిఖిల్ గుప్తా తెలిపారు.