Sharad Pawar: మోదీ మాట్లాడింది సరికాదు.. ఆ క్రెడిట్ మాదే: శరద్ పవార్
ABN , First Publish Date - 2023-09-26T21:13:21+05:30 IST
మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ తమదేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పుకోవడానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కొట్టిపారేశారు. దేశంలోనే మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని చెప్పారు.
ముంబై: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) క్రెడిట్ తమదేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పుకోవడానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) కొట్టిపారేశారు. దేశంలోనే మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని చెప్పారు.
మహిళల కోసం విధానాలు రూపొందించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర అని, కేంద్రంలో తాను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిఫెన్స్ బలగాల్లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పవార్ తెలిపారు. 1994 జూన్ 14న తన సారథ్యంలో మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్, జిల్లా స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టిందని, ఇందుకు సంబంధించిన విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం క్రెడిట్‌ను మహారాష్ట్ర దక్కించుకుందని చెప్పారు.
ఇండియా-కెనడా వివాదం, ఉల్లి ఎగుమతి సుంకంపై...
ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంపై పవార్ మాట్లాడుతూ, తన మద్దతు భారత ప్రభుత్వానికేనని అన్నారు. ఒక భారతీయ పౌరుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఇండియా-కెనడా ఉద్రికతల వ్యవహారంలో భారత ప్రభుత్వానికే తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధించడంపై ఆయన నిశిత విమర్శ చేశారు. బంగ్లాదేశ్‌కు భారత్ అతిపెద్ద ఎగుమతిదారు అని, ఎగుమతి సుంకం 40 శాతం పెంచడం వల్ల ఉల్లి సరఫరా, ఎగుమతులపై ఆ ప్రభావం పడుతుందని అన్నారు. ఇందువల్ల రైతులు దెబ్బతింటారని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారంనాడు ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు తెలిసిందని పవార్ చెప్పారు.