Bharat Jodo Yatra: భద్రతా లోపాలపై అమిత్‌షా‌కు ఖర్గే లేఖ

ABN , First Publish Date - 2023-01-28T14:09:19+05:30 IST

భారత్ జోడో యాత్రలో భద్రతా లోపాలు తలెత్తడం, ఆ కారణంగా కశ్మీర్‌లో శుక్రవారంనాడు యాత్ర నిలిపివేయాల్సి రావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ...

Bharat Jodo Yatra: భద్రతా లోపాలపై అమిత్‌షా‌కు ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భద్రతా లోపాలు తలెత్తడం, ఆ కారణంగా కశ్మీర్‌లో శుక్రవారంనాడు యాత్ర నిలిపివేయాల్సి రావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు తగిన జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు అమిత్‌షాకు ఖర్గే శనివారంనాడు ఒక లేఖ రాశారు. ఖాజిగుండ్‌లో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ఉహసంహరించడంతో యాత్రను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఖర్గే లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

''రాబోయే రెండు రోజ్లుల్లో పెద్ద సంఖ్యలో జనం యాత్రలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్‌లో ఈనెల 30న ఫంక్షన్ కూడా జరుపుతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మీరు (అమిత్‌షా) వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, యాత్ర ముగిసేంత వరకూ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నాం'' అని ఆ లేఖలో ఖర్గే కోరారు. భారత్ జోడో యాత్రలో దురదృష్టవశాత్తూ భద్రతా వైఫల్యాలు తలెత్తడంతో తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ సెక్యూరిటీ డిటైల్స్ ఇన్‌చార్జి సలహా మేరకే యాత్రను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. యాత్ర పూర్తయ్యేంత వరకూ పూర్తి భద్రత కల్పించగలమంటూ జమ్మూ కశ్మీర్ పోలీసులు చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. భారత్ జోడో యాత్రలో సామాన్య ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందున ఏ రోజు ఎంతమంది హాజరవుతారనేది అంచనా వేసి చెప్పడం నిర్వాహకులకు కష్టమవుతుందని, సామాన్య ప్రజానీకం భారత్ జోడో యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని ఆ లేఖలో ఖర్గే హోం మంత్రి దృష్టికి తెచ్చారు.

రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో పర్యటించి ఈనెల 30న శ్రీనగర్‌లో ముగియనుంది. 3,500 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. అయితే, ఇది రాజకీయ యాత్ర కాదని, దేశంలో పెరుగుతున్న విద్వేషాల నుంచి ఐక్య భారతాన్ని సాధించేందుకు నిర్వహిస్తున్న యాత్ర అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

Updated Date - 2023-01-28T14:09:22+05:30 IST