Share News

Mallikarjuna Kharge: మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌పై, ప్రజాస్వామ్యంపై దాడి చేసింది.. మల్లికార్జున ఖర్గే మండిపాటు

ABN , Publish Date - Dec 18 , 2023 | 09:48 PM

పార్లమెంట్ ఉభయసభల్లో ‘భద్రతా లోపం’పై కేంద్ర హోంమంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినందుకు.. ఏకంగా 92 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. తొలిరోజు 14 మందిని సస్పెండ్ చేయగా.. సోమవారం నాడు 78 మందిపై వేటు

Mallikarjuna Kharge: మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌పై, ప్రజాస్వామ్యంపై దాడి చేసింది.. మల్లికార్జున ఖర్గే మండిపాటు

Mallikarjuna Kharge On Modi Govt: పార్లమెంట్ ఉభయసభల్లో ‘భద్రతా లోపం’పై కేంద్ర హోంమంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినందుకు.. ఏకంగా 92 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. తొలిరోజు 14 మందిని సస్పెండ్ చేయగా.. సోమవారం నాడు 78 మందిపై వేటు పడింది. దీంతో.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేని పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అసమ్మతి లేకుండానే.. భారీ మెజారిటీతో పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన చట్టాలను ఆమోదించగలదని ఆరోపించారు. డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌లో ఒక దాడి జరిగిందని.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మరోసారి పార్లమెంట్‌పై, అలాగే ప్రజాస్వామ్యంపై దాడి చేసిందంటూ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘‘2023 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఇప్పుడు మరోసారి మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌పై, ప్రజాస్వామ్యంపై దాడి చేసింది. నియంతృత్వ మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు 92 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి.. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ చెత్తబుట్టలో పడేసింది’’ అని తన ఎక్స్ ఖాతాలో మల్లికార్జున ఖర్గే పోస్టు చేశారు. ఇదే సమయంలో తమవి రెండు డిమాండ్ ఉన్నాయని అన్నారు. ‘‘మాకు కేవలం రెండే రెండు డిమాండ్లు ఉన్నాయి. ఒకటి.. పార్లమెంట్ భద్రతా లోపంపై పార్లమెంట్ ఉభయ సభల్లో హోంమంత్రి ప్రకటన ఇవ్వాలి. రెండోది.. ఆ ఘటనపై సవివరమైన చర్చ జరగాలి’’ అని ఎక్స్ వేదికగా ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పత్రికలకు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వగలరు కానీ.. పార్లమెంట్‌లో మాత్రం బీజేపీ తన జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందని ఆయన విరుచుకుపడ్డారు.

అంతకుముందు.. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్‌కు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా లోపం సంఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని డెరెక్ డిమాండ్ చేశారని, అయితే ఆయన్ను మీరు (స్పీకర్) డిసెంబర్ 14న సస్పెండ్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు భద్రత లోపంపై చర్చ న్యాయమేనని అన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి మీడియాలో మాట్లాడుతున్నారు కానీ పార్లమెంట్‌లో మాట్లాడటం లేదని.. ఇది పార్లమెంట్‌ సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని ఖర్గే చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 18 , 2023 | 09:48 PM