Mamata Banerjee: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు.. తన వైఖరి స్పష్టం చేసిన మమతా బెనర్జీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 07:05 PM
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. ప్రతిపక్షాలు కలిసి ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో ప్రధాన అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న పెద్ద మిస్టరీగా మారింది. ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ సందేహం వ్యక్తమవుతూనే ఉన్నా..
Mamata Banerjee INDI Alliance PM Candidate: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. ప్రతిపక్షాలు కలిసి ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో ప్రధాన అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న పెద్ద మిస్టరీగా మారింది. ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ సందేహం వ్యక్తమవుతూనే ఉన్నా.. ఆ సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. కూటమిలోని సభ్యులు సైతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారే తప్ప.. ఫలానా అభ్యర్థిని అనుకుంటున్నామని ఏ ఒక్కరూ బలంగా చెప్పడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అలాగే రియాక్ట్ అయ్యారు. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా.. ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని తన వైఖరిని స్పష్టం చేశారు.
ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడం కోసం ఢిల్లీలో ఉన్న మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం’’ అని అన్నారు. అలాగే.. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌లతో పొత్తు కచ్ఛితంగా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. ఢిల్లీలో జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో సీట్ షేరింగ్ విషయంపై చర్చించే అవకాశం ఉందన్నారు. దీనిపై వివరంగా చర్చించుకోవడానికి ఈ సమావేశం మంచి అవకాశమన్నారు. చాలా పార్టీలు ఒక్కో సీటు పంచుకోవడంపై అంగీకారం తెలపొచ్చు కానీ, ఒకట్రెండు పార్టీలు మాత్రం అంగీకరించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అందరూ కలిసే ఉంటారని తాను నమ్ముతున్నానన్నారు. తనకంటూ ప్రత్యేక నినాదమో లేక వ్యతిరేకత అంటూ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. సీట్ల పంపకాల్లో ఆలస్యమేమీ జరగలేదని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. పార్లమెంటు శీతాకాల సమావేశాల మిగిలిన కాలానికి ప్రతిపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేయడంపై కూడా మమతా బెనర్జీ స్పందించారు. ఇలా అందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని, వారు సభను సుప్రీం అని భావిస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సభ్యులందరినీ సస్పెండ్ చేస్తే ఎలా గొంతెత్తుతారని అడిగారు. వాళ్ళు మూడు ముఖ్యమైన బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ ఉందని.. ప్రజల తరఫున గొంతెవరు ఎత్తుతారని నిలదీశారు. ప్రజల గొంతుకను అణచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారన్న బీజేపీ వాదనపై స్పందిస్తూ.. అది సాధ్యమవ్వదని ధీమా వ్యక్తం చేశారు.