Manipur violence: మోదీకి చీమకుట్టినంత బాధ కూడా లేదు... మమత ఫైర్
ABN , First Publish Date - 2023-07-21T15:02:08+05:30 IST
మణిపూర్‌లో సభ్యసమాజం తల వంచుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరించిన ఘటనపై నిరసనలు పెల్లుబుకుతుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిలదీశారు. ఈ ఘటన మీ హృదయాన్ని కొంచెమైనా బాధించలేదా అని ప్రశ్నించారు.
కోల్‌కతా: మణిపూర్ (Manipur)లో సభ్యసమాజం తల వంచుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరించిన ఘటనపై నిరసనలు పెల్లుబుకుతుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ (Narendra Modi)ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) నిలదీశారు. ఈ ఘటన మీ హృదయాన్ని కొంచెమైనా బాధించలేదా అని ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌ను వేలెత్తి చూపుతున్న ప్రధానికి తల్లులు, చెల్లెళ్ల మీద ఎలాంటి ప్రేమలేకుండా పోయిందన్నారు. ఆడకూతుళ్లను తగులబెడుతున్నంత వరకూ, దళితులు, మైనారిటీలపై హత్యలు కొనసాగుతున్నంత కాలం మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో తమ ఆడకూతుళ్ల కోసం ప్రశ్నించడం మానేది లేదని ఆమె స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకూ విశ్రమించేందుకు లేదన్నారు.
ఆడకూతుళ్లను రక్షించండి (బేటీ బచావ్) అంటూ బీజేపీ నినాదం ఇస్తుంటుందని, ఇప్పుడు ఆ నినాదం ఏమైందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మణిపూర్ ప్రజలకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు చెప్పారు. ఈరోజు మణిపూర్ తగులబడుతోందని, యావద్దేశం మంటల్లో ఉందని ఉన్నారు. బిల్కిస్ బానో కేసులో నిందితులను బెయిలుపై విడుదల చేశారని, రెజ్లర్ (బ్రిజ్ భూషణ్ కేసు) కేసులో బెయిల్ మంజూరు చేశారని, రాబోయే ఎన్నికల్లో మహిళలను దేశ రాజకీయాలకు దూరం చేయాలని అనుకుంటున్నారని బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.
మీరు విఫల సీఎం: బీజేపీ
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్ హోం మంత్రిగా కూడా ఉన్న మీరు శాంతిభద్రతలను కాపాడాల్సి ఉండగా అక్కడ జరుగుతున్నదేమిటని బీజేపీ నేత అమిత్ మాలవీయ ప్రశ్నించారు. హౌరాలోని పాంచ్లాలో పంచాయతీ ఎన్నికల రోజు గ్రామ సభ అభ్యర్థి అయిన మహిళను దారుణంగా కొట్టి, నగ్నంగా చేసి ఊరిగించినప్పుడు, రాళ్లు రువ్వినప్పుడు మీరు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడి తెచ్చేంతవరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. ''మీరు విఫల సీఎం. ముందు మీ పశ్చిమబెంగాల్ మీద దృష్టి పెట్టండి'' అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.