Share News

INDIA Bloc Meet: నాకు తెలియదన్న మమత... గైర్హాజరుకే మొగ్గు..

ABN , First Publish Date - 2023-12-04T20:35:13+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే బుధవారంనాడు జరిగే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.

INDIA Bloc Meet: నాకు తెలియదన్న మమత... గైర్హాజరుకే మొగ్గు..

కోల్‌కతా: 'ఇండియా' (INDIA) కూటమి పార్టీలతో సీట్ల షేరింగ్ లేకపోవడం వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వచ్చే బుధవారంనాడు జరిగే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. అదేరోజు కోల్‌‍కతాలో ముందస్తు షెడ్యూల్ ఉండటం వల్ల ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉండనున్నట్టు చెబుతున్నారు. అదీగాక కూటమి సమావేశం గురించి తనకు తెలియదని ఆమె సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


''ఈ సమావేశం (ఇండియా కూటమి) గురించి నాకు తెలియదు. కోల్‌కతా ఓ కార్యక్రమానికి ముందస్తు షెడ్యూల్ కూడా ఉంది. అక్కడ నాకు ఏడు రోజుల ప్రోగ్రాం ఉంది. ఒకవేళ నాకు ముందే సమావేశం గురించి తెలిసి ఉంటే నా కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేదాన్ని. నేను తప్పనిసరిగా కోల్‌కతా కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది'' అని మమతా బెనర్జీ చెప్పారు.


కాంగ్రెస్ స్పందన

మమతా బెనర్జీ ప్రకటనపై కాంగ్రెస్ ప్రతినిధి జైరామ్ రమేష్ స్పందించారు. ఇండియా కూటమి సమావేశం లాంఛనపూర్వకమేనని చెప్పారు. ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారంనాడు పిలుపునిచ్చారు. మూడు నెలల గ్యాప్ తరువాత ఈ సమావేశం జరుగనుంది. గత సమావేశం ముంబైలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగింది. కాగా, ఇండియా కూటమి తాజా సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయం ఇండియా కూటమికి ఎదురుదెబ్బగా విపక్ష పార్టీల నేతలు గళం విప్పుతున్న తరుణంలో కూటమి సమావేశానికి ఖర్గే పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, అసెబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇండియా కూటమిపై ఉండదని శరద్ పవార్ సహా పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-12-04T20:35:15+05:30 IST