INDIA bloc meeting: సమష్టి పోరాటం పైనే చర్చ... పీఎం అభ్యర్థిత్వంపై తేల్చిచెప్పిన ఖర్గే
ABN , Publish Date - Dec 19 , 2023 | 08:21 PM
ఇండియా కూటమి నాలుగో సమావేశం మంగళవారంనాడు విజయవంతంగా ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీట్ల సర్దుబాటు అంశంపైనా చర్చ జరిగింది.
న్యూఢిల్లీ: ఇండియా (I.N.D.I.A.) కూటమి నాలుగో సమావేశం మంగళవారంనాడు విజయవంతంగా ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీట్ల సర్దుబాటు అంశంపైనా చర్చ జరిగింది. ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నించినప్పటికీ మల్లికార్జున్ ఖర్గే వారించారు. అలాంటి ప్రయత్నాలు వద్దని, ముందు పోరాటం, ఆ తర్వాతే ప్రధాని ఎవరనే నిర్ణయం తీసుకుందామని తేల్చిచెప్పారు. ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో సుమారు 3 గంటల సేపు జరిగిన 'ఇండియా' కూటమి సమావేశంలో 28 పార్టీల నేతలు పాల్గొన్నారు.
పీఎం అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదన..
కాగా, ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి పేరును ప్రకటించేందుకు ఇండియా కూటమి భాగస్వాములు సిద్ధమయ్యారు. మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారని, మరికొందరు దీనిని సమర్ధించారని తెలుస్తోంది. అయితే, అలాంటి ప్రకటన చేయవద్దని ఖర్గే వారించారు. సమిష్టిగా పోరాటం చేద్దామని, గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేది తర్వాత నిర్ణయిద్దామని ఖర్గే సూచించారు. ఒకే గొడుకు కిందకు అందరూ రాకపోతే కూటమి ప్రాధాన్యతను గుర్చించే అవకాశం లేదని సమావేశంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.
ఎంపీల సస్పెన్షన్‌ను ఖండించిన నేతలు.. 22న దేశవ్యాప్త ఆందోళన
పార్లమెంటు నుంచి 142 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఇండియా కూటమి ఖండించింది. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమంటూ తీర్మానం చేసింది. పార్లమెంటులో దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మోదీ ప్రజాస్వామ్యాన్ని మోదీస్వామ్యంగా మార్చారని ఆ తీర్మానం తప్పుపట్టింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా సభకు హాజరై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని ప్రారంభోత్సవాలు, పర్యటనలకు పరిమితమవుతూ, తప్పించుకుని తిరిగుతున్నారని ఆక్షేపించింది. ఇంతమంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంలో పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయించింది.
సీట్ల సర్దుబాటుపై...
సీట్ల సర్దుబాటు విషయంలో కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి జఠిలమైన రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని సమావేశం నిర్ణయించింది. సీట్ల షేరింగ్, కలిసికట్టుగా జనాల్లోకి వెళ్లే కార్యాక్రమాలు 20 రోజుల్లో ప్రారంభించి, మూడు వారాల్లో వీటిపై నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఢిల్లీ, పంజాబ్‌లకు సంబంధించిన వ్యూహాన్ని తరువాత ఖరారు చేయాలని కూడా నిర్ణయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆపార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపి అగ్రనేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, జేడియూ అగ్ర నేత నితీష్ కుమార్, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వియాదవ్, సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆప్ నేతలు హాజరయ్యారు.