Manipur Violence: ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ..

ABN , First Publish Date - 2023-08-07T18:47:51+05:30 IST

ఢిల్లీ: మణిపూర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది.

Manipur Violence: ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ..

ఢిల్లీ: మణిపూర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది. ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ గీతా మిట్టల్ (జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలిని జోషి (ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి), జస్టిస్స ఆశా మీనన్ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) ఉంటారని తెలిపింది. చట్టపాలనపై విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే ఈ కమిటీని ఏర్పాటుచేస్తున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.


మణిపూర్ హింసపై సీబీఐ విచారణను మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పడ్‌సాలగీకర్ పర్వవేక్షిస్తారని ధర్మాసనం తెలిపింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కనీసం ఐదుగురు డిప్యూటీ సూపరింటెడెంట్ స్థాయి అధికారులు సీబీఐలో ఉంటారని పేర్కొంది. సీబీఐకి బదలీ చేయని కేసుల వ్యవహారం 42 సిట్‌లు చూసుకుంటాయని, మణిపూర్‌‌‌కు సంబంధం లేని డీఐజీ ర్యాంకు అధికారులు ఈ సిట్‌లను పర్యవేక్షిస్తారని, ఒక్కో ఆఫీసర్ ఆరు సిట్‌లను పర్యవేక్షిస్తారని, విచారణ సజావుగా సాగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.


మణిపూర్ డీజీపీ హాజరు

మణిపూర్ హింసపై దాఖలైన పిటిషన్లపై గత విచారణలో సుప్రీం విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ సోమవారంనాడు ధర్మాసనం ముందు హాజరయ్యారు. మణిపూర్ హింస, నివారణకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు ఆయన వివరించారు. హింసాత్మక ఘటనలపై జిల్లా ఎస్పీల నేతృత్వంలో సిట్‌ల ఏర్పాటుకు సిద్ధమని రాజీవ్ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మసానం ముందు హాజరయ్యారు. గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించిన నివేదికలను సమర్పించారు.

Updated Date - 2023-08-07T18:47:51+05:30 IST