Rajasthan: కాంగ్రెస్ నుంచి చాలామంది బయటకు వచ్చేస్తున్నారు.. బాంబు పేల్చిన బీజేపీ నేత
ABN , First Publish Date - 2023-10-22T17:16:01+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు త్వరలోనే ఆ పార్టీని వీడబోతున్నారని రాజస్థాన్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తెలిపారు. రాజస్థాన్‌లో బీజేపీ రెండవ జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు త్వరలోనే ఆ పార్టీని వీడబోతున్నారని రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ (Rajendra Rathore) తెలిపారు. రాజస్థాన్‌లో బీజేపీ రెండవ జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోతున్న పడవ అని, ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పడవ నుంచి బయటపడబోతున్నారని అన్నారు.
మునిగిపోతున్న పడవ కాంగ్రెస్
''ఎన్నికలకు కనీసం మూడు రోజుల ముందైనా కాంగ్రెస్‌లో తప్పనిసరిగా అలజడి మొదలవుతుంది. పడవకు చిల్లు పడినప్పుడు తెలివైన వ్యక్తులు బయటపడతారు. చాలా మంది పేరున్న నేతలు కాంగ్రెస్ పడవ నుంచి దిగిపోవడం మీరు చూస్తారు'' అని రాథోడ్ చెప్పారు. క్యాడర్ ఉన్న పార్టీ బీజేపీ అని, ఇప్పటివరకూ 124 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి బీజేపీ దింపందని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం కనీసం మూడు డజన్ల మంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేదని విమర్శించారు.
2018 ఎన్నికల్లో..
రాజస్థాన్‌లోని 200 మంది సభ్యుల అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఆ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. కాగా, ఈసారి గెలుపుపై రెండు ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.