Maratha reservation row: నిరాహార దీక్ష విరమించేందుకు మనోజ్ జారంగే అంగీకారం..కానీ..!

ABN , First Publish Date - 2023-09-12T16:35:41+05:30 IST

మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌పై నిరవధిక నిరాహారదీక్ష సాగిస్తున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉజయన్‌రాజే భోసలే సమక్షంలో దీక్ష విరమించేందుకు అంగీకరించారు. అయితే, ఆందోళన విరమించినప్పటికీ నిరసన స్థలి నుంచి కదిలి వెళ్లేది లేదన్నారు.

Maratha reservation row: నిరాహార దీక్ష విరమించేందుకు మనోజ్ జారంగే అంగీకారం..కానీ..!

ముంబై: మరాఠా రిజర్వేషన్ల (Maratha reservation) డిమాండ్‌పై నిరవధిక నిరాహారదీక్ష సాగిస్తున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ (Manoj Jaragne patil) సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉజయన్‌రాజే భోసలే సమక్షంలో దీక్ష విరమించేందుకు అంగీకరించారు. అయితే, ఆందోళన విరమించినప్పటికీ నిరసన స్థలి నుంచి కదిలి వెళ్లేది లేదన్నారు. మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నెలరోజుల వ్యవధి ఇచ్చారు. అక్టోబర్ 12న మరాఠా సమాజంతో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.


కోటా ఆందోళన..

మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో ఇందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జారంగే పాటిల్ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ ఆందోళనలను ఊపందుకున్నాయి. ఆందోళనకారులపై జల్నాలో పోలీసులు లాఠీచార్జి జరపడంతో హింసాకాండ చెలరేగింది. సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వ బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో షిండే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోలీసు లాఠీచార్జిపై క్షమాపణ చెప్పడంతో పాటు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చించింది. మరాఠా ఆందోళనల ప్రతినిధులతోనూ సమావేశమైంది. కోటా సమస్యను తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చూస్తోందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరాఠాలను ఓబీసీ కేటగిరిలో చేర్చి కుటుంబీకులకు ధ్రువీకరణ పత్రం ఎలా ఇవ్వవచ్చో తెలియజేసేందుకు ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసి నెలలోపు నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2023-09-12T16:35:41+05:30 IST