Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తాం..
ABN , First Publish Date - 2023-11-07T10:19:19+05:30 IST
సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తేలేదని, తన ప్రసంగానికి వ్యతిరేకంగా
- మంత్రి ఉదయనిధి పునరుద్ఘాటన
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తేలేదని, తన ప్రసంగానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో దాఖలయ్యే కేసులన్నింటినీ చట్ట ప్రకారం ఎదుర్కొంటామని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాశాఖాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పునరుద్ఘాటించారు. నీట్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన సోమవారం ఉదయం అశోక్‌నగర్‌లో ఉన్న డీపీఐ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ అధినేత తిరుమావళవన్, పార్టీ నాయకుల సంతకాలు సేకరించారు. ఆ సందర్భంగా ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ... నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించే ఉద్యమం ఊపందుకుందన్నారు. ఇప్పటివరకూ 10లక్షల సంతకాలు సేకరించానని చెప్పారు. ఈ సంతకాల ఉద్యమానికి డీఎంకే మిత్రపక్షాల మద్దతు మాత్రమే కాకుండా అన్నాడీఎంకే, పీఎంకే(AIADMK, PMK) తదితర ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా సేకరిస్తామన్నారు. ఆ రెండు పార్టీల నేతలను కలుసుకునేందుకు సమయం కేటాయించాలని కోరానని చెప్పారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రసంగించడాన్ని ఖండిస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి మీడియా అడగ్గా.. ఈ విషయంలో అంబేడ్కర్, పెరియార్ చేసిన వ్యాఖ్యల కంటే తాను తక్కువే చేశానని వివరణ ఇచ్చారు.
ఆ దివంగత నాయకులిరువురూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఎన్నో ప్రసంగాలు చేశారన్నారు. ఈ వ్యవహారంలో పదవులు పొతాయని పలువురు తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని, మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, డీఎంకే యువజన విభాగం అధ్యక్ష పదవి అంటూ అన్ని పదవులు శాశ్వతం కాదన్నారు. మానవత్వంతో కూడిన మంచి మనిషిగా ఉండటమే స్థిరమైన విషయమన్నారు. నీట్‌కు మినహాయింపు పొందడమే తన తక్షణ కర్తవ్యమని, సనాతన ధర్మం సమస్య శతాబ్దాల తరబడి కొనసాగుతున్న సమస్య, ఆ ధర్మాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. కోర్టు కేసులను చట్ట ప్రకారం ఎదుర్కొంటానని ఉదయనిధి స్పష్టం చేశారు. ఇదిలా వుండగా నీట్‌కు వ్యతిరేకంగా సంతకం చేసిన పత్రాలను డీపీఐ నేత తిరుమావళవన్, ఆ పార్టీ ఎంపీ రవికుమార్, ఎమ్మెల్యేలు ఎస్‌ఎస్ బాలాజీ, ఆలూరు షానవాజ్, పనైయూరు బాబు ఉదయనిధి తీసుకెళ్లిన పెట్టెలో వేశారు. ఈ సందర్భంగా తిరుమావళవన్ మాట్లాడుతూ... మంత్రి ఉదయనిధి నీట్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సంతకాల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ప్రకటించారు.