Share News

Minister: ఆ విమర్శలు నా వ్యక్తిగత అభిప్రాయం.. నేను మంత్రిగా మాట్లాడలేదు..

ABN , First Publish Date - 2023-10-17T07:18:12+05:30 IST

సనాతనం నిర్మూలించాలనే మాట్లాడడం తన వ్యక్తిగత అభిప్రాయమని, మంత్రిగా తాను మాట్లాడలేదని మద్రాసు హైకోర్టులో మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)

Minister: ఆ విమర్శలు నా వ్యక్తిగత అభిప్రాయం.. నేను మంత్రిగా మాట్లాడలేదు..

- హైకోర్టులో మంత్రి ఉదయనిధి

పెరంబూర్‌(చెన్నై): సనాతనం నిర్మూలించాలనే మాట్లాడడం తన వ్యక్తిగత అభిప్రాయమని, మంత్రిగా తాను మాట్లాడలేదని మద్రాసు హైకోర్టులో మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) తరఫున బదులు పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి... సనాతనాన్ని దోమ, డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటిలా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తరుణంలో, డీఎంకే ఎంపీ ఎ.రాజా(DMK MP A. Raja) కూడా సనాతనం నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీంతో, బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు ఉదయనిధి, శేఖర్‌బాబు, ఎ.రాజా ఇలాంటి వ్యాఖ్య లు చేయడంపై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఉదయనిధి తరఫున దాఖలుచేసిన బదులు పిటిషన్‌లో, సనాతనం నిర్మూలించాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమా? తనపై కేసు దాఖలుచేయడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడానే తప్ప, మంత్రిగా మాట్లాడలేదని తెలిపారు. సనాతనం గురించి రాజ్యాంగం, మరే ఇతర చట్టాల్లో పేర్కొనలేదన్నారు. సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆరోపించిన పిటిషన్‌దారులు, అందుకు సంబంధించిన ఆధారాలు దాఖలు చేయలేదని మంత్రి బదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వాదన విన్న న్యాయమూర్తి అనితా సుమంత్‌, కేసు తదుపరి విచారణ ఈనెల 31వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2023-10-17T07:18:12+05:30 IST