Minister Udayanidhi: నేను కష్టపడే మంత్రినయ్యా.. మీ కొడుకు ఏం చేసి క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడో చెప్పండి
ABN , First Publish Date - 2023-07-30T07:41:10+05:30 IST
సాధారణ కార్యకర్తగా ఇప్పటివరకూ పార్టీకి చేసిన సేవల కారణంగానే తాను మంత్రి పదవిని పొందానని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Am
- అమిత్‌షాకు ఉదయనిధి సూటి ప్రశ్న
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సాధారణ కార్యకర్తగా ఇప్పటివరకూ పార్టీకి చేసిన సేవల కారణంగానే తాను మంత్రి పదవిని పొందానని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) కుమారుడు జైషా ఏం చేసి పదవులు పొందారో చెప్పగలరా అని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ప్రశ్నించారు. అన్నా అరివాలయంలో డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటైన సభలో ఆ విభాగం అధ్యక్షుడి హోదాలో ఉదయనిధి ప్రసంగించారు. రామేశ్వరానికి విచ్చేసిన అమిత్‌షా అనవసరంగా తన పేరును ప్రస్తావించారని, ముఖ్యమంత్రి స్టాలిన్ త్వరలో తనకు సీఎం పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించడం గర్హనీయమన్నారు. డీఎంకే(DMK) యువజన విభాగం అధ్యక్ష పదవి, మంత్రి పదవి తనకు సులువుగా దక్కలేదని, పార్టీ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగానే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఓ ప్రశ్న వేయదలిచా... అందుకు వెంటనే సమాధనమివ్వాలి... అని పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా అమిత్‌షా కుమారుడు జైషాకు ఆ పదవి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
జైషా ఎప్పుడైనా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడారా? ఎన్ని పరుగులు తీశారు? ఈ ప్రశ్నలకు అమిత్‌షా బదులివ్వాలని డిమాండ్ చేశారు. జైషా నడుపుతున్న సంస్థ ఆస్తులు 2014లో రూ.74లక్షలని, ప్రస్తుతం ఆ సంస్థ ఆస్తులు రూ.130 కోట్లకు పెరిగాయని, ఇదెలా సాధ్యమైందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. రామేశ్వరం సభలో అమిత్‌షా అనవసరంగా తన పేరును ప్రస్తావించడం వల్లే తాను ఈ ప్రశ్నలు సంధిస్తున్నానని తెలిపారు. ఈ సభలో డీఎంకే కోశాధికారి, ఎంపీ టీ.ఆర్.బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.