MLAs: ఇకనైనా మాజీ సీఎం సీటు మార్చండి సార్..
ABN , First Publish Date - 2023-09-23T07:52:28+05:30 IST
సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం తమ వర్గాన్నే అసలైన అన్నాడీఎంకేగా గుర్తించడంతో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం
- స్పీకర్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వినతి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం తమ వర్గాన్నే అసలైన అన్నాడీఎంకేగా గుర్తించడంతో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) సీటును మార్చాలని స్పీకర్ అప్పావు(Speaker Appavu)కు అన్నాడీఎంకే నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన అన్నాడీఎంకే నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. రెండున్నర సంవత్సరాలకుగా పైగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), ఓపీఎస్ ప్రధాన ప్రతిపక్షం వరుసలో పక్కపక్క సీట్లలోనే ఆశీనులవుతున్నారు. అన్నాడీఎంకే నుంచి ఓపీఎస్‌ను బహిష్కరించి, ఆయనకు బదులుగా ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఆర్బీ ఉదయకుమార్‌ను ఎన్నుకున్న విషయాన్ని గతంలో స్పీకర్‌ను ఆ పార్టీ శాసనసభ్యులంతా కలుసుకుని వినతిపత్రం సమర్పించి సీటు మార్చాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ అప్పావు ఆ విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారే తప్ప, ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ఇలా రెండు సార్లు అన్నాడీఎంకే సభ్యులు ఈ విషయమై అప్పావును కలుసుకుని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఈపీఎ్‌సను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గుర్తించడంతో ప్రస్తుతం ఆ హోదాను గుర్తించి ఓపీఎస్ సీటును, ఆయన వర్గానికి చెందిన వైద్యలింగం, మనోజ్ పాండ్యన్ సీట్లను మార్చాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్‌ను గుర్తించి ఈపీఎస్ పక్క సీటును ఆయనకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. స్పీకర్‌ను కలుసుకున్న వారిలో సీనియర్ నేతలు సెంగోట్టయ్యన్, సెల్లూర్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు.