Supreme Court : అంబానీ కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత... ఖర్చుల భారం ఎవరు మోయాలంటే...
ABN , First Publish Date - 2023-03-01T14:06:15+05:30 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులకు దేశ, విదేశాల్లో జెడ్ ప్లస్
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులకు దేశ, విదేశాల్లో జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ భద్రత కోసం అయ్యే ఖర్చులను వారే స్వంతంగా భరించాలని తెలిపింది. Z+ సెక్యూరిటీ అనేది అత్యున్నత స్థాయి భద్రత అని తెలిసిందే.
యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బికాశ్ సాహా కేసులో దాఖలైన మిసిలేనియస్ పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ముకేశ్ అంబానీకిగల ముప్పును తెలిపే నివేదికలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని త్రిపుర హైకోర్టు ఆదేశించడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. దీనికోసం అయ్యే ఖర్చులను అంబానీలే భరించాలని తెలిపింది. వీరికి భద్రత కల్పించడంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ హైకోర్టుల్లో వివాదం నడుస్తున్న విషయాన్ని తాము గుర్తించినట్లు తెలిపింది.
అంబానీలు మన దేశంలో ఉన్నపుడు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించాలని తెలిపింది. వారు విదేశాలకు వెళ్లినపుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించాలని పేర్కొంది. ముప్పు ఉన్నపుడు, భద్రత కోసం అయ్యే ఖర్చులను వారే భరిస్తున్నపుడు ఫలానా ప్రాంతానికి, లేదా, ఫలానా చోటుకు పరిమితం చేయడం సరికాదని తెలిపింది. ఆ విధంగా పరిమితం చేయడం వల్ల వారికి భద్రత కల్పించడం వెనుకగల ఉద్దేశం దెబ్బతింటుందని పేర్కొంది. అంబానీల వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా వారికి భద్రతను పరిమితం చేయడం సరికాదని తెలిపింది.
సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ, ముంబై పోలీసులు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వం అంబానీలకుగల ముప్పు గురించి మదింపు చేశాయని తెలిపారు. వారికి ముప్పు ఉన్నట్లు నిర్థరించినందువల్లే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారని పేర్కొన్నారు. అంబానీలకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయని, వీరు దాతృత్వ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడం కోసం వీరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాదం కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఉంటుందన్నారు. అందువల్ల వీరికి మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా రక్షణ కల్పించాలని కోరారు.
త్రిపుర హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి :
Lok Sabha Elections : బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్న కమల్ హాసన్!
Rahul Gandhi : రాహుల్ గాంధీ న్యూ లుక్స్... చూసి తీరాల్సిందే...