Mukesh Ambani: శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయానికి ముకేష్ అంబానీ, బాబోయ్ ఎంత విరాళం ఇచ్చారో తెలుసా...
ABN , First Publish Date - 2023-02-19T13:30:03+05:30 IST
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ ఆలయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త..
అహ్మదాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ ఆలయాన్ని (Somnath Temple) ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేష్ అంబానీ (Mukesh Ambani), ఆయన కుమారుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ (Akash Ambani) దర్శించుకున్నారు. ఆలయ ట్రస్టు చైర్మన్ పీకే లహరి, సెక్రటరీ యోగేంద్రభాయ్ దేశాయ్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయ పూజారి గౌరవ సూచకంగా ఉభయులకూ చందనం పూశారు. ఆలయంలో సోమేశ్వరునికి ముకేష్, ఆకాష్‌లు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయ ట్రస్టుకు ముఖేష్ అంబానీ రూ.1.51 కోట్ల విరాళాన్ని అందజేశారు.
ఏటా ప్రధానమైన పండుగ సందర్భాల్లో ముకేష్, ఆయన కుటుంబ సభ్యులు ఆయా ఆలయాలను సందర్శించి భూరి విరాళాలను అందజేస్తుంటారు. ప్రత్యేక పూజాదికాలు చేస్తుంటారు. గత ఏడాది రాజస్థాన్‌లోని ప్రఖ్యాత శ్రీనాథ్‌జీ ఆలయాన్ని ముకేష్ సందర్శించి ఆలయ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళమిచ్చారు. అక్కడే ఆయన జియో 5జీ సేవలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అదే నెలలో ఆయన ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించి రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారిని ముకేష్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకున్నారు. రూ.1.5 కోట్లు విరాళాన్ని అందజేశారు.