Rahul Gandhi: మోదీలా నా ప్రసంగం మీడియాలో కనిపించదు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-02-22T16:30:09+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల గుప్పిట్లో ..

Rahul Gandhi: మోదీలా నా ప్రసంగం మీడియాలో కనిపించదు.. ఎందుకంటే..?

షిల్లాంగ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల గుప్పిట్లో మీడియా ఉన్నందున మోదీ ప్రసంగాల మాదిరిగా కాకుండా తన ప్రసంగాలు మీడియాలో కనిపించవని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మేఘాలయ (Meghalaya)లో రాహుల్ బుధవారంనాడు తొలి ప్రసంగం చేశారు. షిల్లాంగ్‌లోని మల్కీ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీతో పాటు టీఎంసీపై కూడా ఆయన సూటి విమర్శలు చేశారు.

బీజేపీకి దన్నుగా టీఎంసీ

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గురించి అందరికీ తెలిసిందనేనని, మేఘాలయాలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూడటమే టీఎంసీ పనిగా పెట్టుకుందని రాహుల్ అన్నారు. ''బెంగాల్‌లో చోటుచేసుకున్న హింస గురించి మీకు బాగా తెలుసు. వాళ్లు (టీఎంసీ) గోవా వచ్చారు. చాలా పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. వాళ్ల ఉద్దేశం బీజేపీకి సహాయం చేయడమే. మేఘాలయాలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలన్నదే టీఎంసీ ఐడియా'' అని టీఎంసీపై రాహుల్ నిప్పులు చెరిగాయి.

అదానీతో సంబంధాల గురించి ప్రశ్నించా..

''అదానీతో మీకు ఎలాంటి సంబంధాలున్నాయని ప్రధానిని నేను ప్రశ్నించాను. అదానీ విమానంలో ఆయనతో పాటు ప్రధాని కూర్చున్న ఫోటో కూడా చూపించాను. ఆ విమానం తన సొంత ఇల్లు అన్నట్టు ప్రధాని చాలా రిలాక్సింగ్‌గా అందులో కూర్చున్నారు. దీనిపై ఒక్క ప్రశ్నకు కూడా ప్రధాని సమాధానం ఇవ్వలేదు'' అని రాహుల్ అన్నారు. నా పేరు గాంధీ అని ఎందుకు ఉంది? నెహ్రూ అని ఎందుకు లేదు? అని ప్రధాని తనను ప్రశ్నించినట్టు చెప్పారు. పార్లమెంటులో తాను ప్రసంగించానని, అయితే పీఎం ప్రసంగించినప్పుడు టీవీలనిండా ఆయనే కనిపించారని, తన ప్రసంగం మాత్రం ఎక్కడా కనిపించలేదని అన్నారు.

ఈశాన్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం...

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపురలో ఈనెల 16న పోలింగ్ జరగగా, ఖర్గేతో సహా కాంగ్రెస్ బడా నేతలు ఎవరూ ప్రచారంలో కనిపించలేదు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం త్రిపుర ప్రచారానికి దూరంగా ఉన్నారు. మేఘాలయ, నాగాలండ్‌ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ అగ్రనేతల జాడ కనిపించలేదు. ఈనెల 21న నాగాలాండ్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మాత్రం ఖర్గే పాల్గొన్నారు. గత 20 ఏళ్లలో నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), బీజేపీ కలిసి నాగాలాండ్‌ను లూటీ చేశాయని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే సరైన తరుణం ఇదేనని ఖర్గే తన ప్రసంగంలో అధికార కూటమిపై విరుచుకుపడ్డారు. కాగా, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27వ తేదీన జరుగనుండగా, మార్చి 2న కౌంటింగ్ జరుగుతుంది.

Updated Date - 2023-02-22T16:30:12+05:30 IST