Annamalai: ఎన్డీయేకు అన్నాడీఎంకే ఉద్వాసనపై స్పందించిన అన్నామలై

ABN , First Publish Date - 2023-09-25T20:36:09+05:30 IST

ఎన్డీయే కూటమి, బీజేపీతో సంబంధాలు తెంచుకున్నట్టు అన్నాడీఎంకే ప్రకటించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తొలిసారి స్పందించారు. ప్రొటోకాల్ ప్రకారం తాజా పరిణామంపై పార్టీ కేంద్ర నాయకత్వం సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు,

Annamalai: ఎన్డీయేకు అన్నాడీఎంకే ఉద్వాసనపై స్పందించిన అన్నామలై

చెన్నై: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న కీలక తరుణంలో ఎన్డీయే (NDA) కూటమి, బీజేపీతో సంబంధాలు తెంచుకున్నట్టు అన్నాడీఎంకే (AIADMK) ప్రకటించడంపై తమిళనాడు బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై (Annamalai) తొలిసారి స్పందించారు. తాను పాదయాత్రలో ఉన్నానని, అన్నాడీఎంకే పత్రికా ప్రకటన ఇప్పుడే చదివానని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం తాజా పరిణామంపై పార్టీ కేంద్ర నాయకత్వం సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు. కోయంబత్తూరు నార్త్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆయన పాదయాత్ర చేస్తున్నారు.


దీనికి ముందు, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నైలో సమావేశమై ఎన్డీయే, బీజేపీతో సంబంధాలు తెంచుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఏడాదిగా తమ పార్టీ కీలక నేతలు, ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, కార్యకర్తలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభ్యంతరకర విమర్శలు చేస్తునే ఉందని ఆయన ఆరోపించారు.


కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సైతం దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీ హయాలో జరిగిన అవినీతి చిట్టా విడుదల చేస్తానని ప్రకటించడంపై అన్నాడీఎంకే కొంతకాలంగా గుర్రుమంటోంది. బీజేపీ అధిష్ఠానం దృష్టికి కూడా ఈ విషయం తీసుకుచ్చింది. బీజేపీతో కూటమి వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే అభిప్రాయం సైతం ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే, బీజేపీతో తెగతెంపులు చేసుకుంటేనే పార్టీకి పునర్వైభవం సాధ్యమని అన్నాడీఎంకే సమావేశంలో అత్యధికులు అభిప్రాయపడంతో అన్నాడీఎంకే తాజా నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.


మూడుసార్లు కలిసి పోటీ...

బీజేపీ, అన్నాడీఎంకే ఇంతవరకూ మూడు సార్లు 1998, 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, జయలలిత నాయకత్వంలో 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒక ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు ఎంతో కాలం సాగలేదు. తిరిగి 2004లో పొత్తులు కుదిరినప్పటికీ రెండు పార్టీలు ఖాతా కూడా తెరవలేదు.

Updated Date - 2023-09-25T20:36:09+05:30 IST