Ajit pawar: ఎన్‌సీపీ తమదేనని ప్రకటించుకున్న అజిత్ పవార్
ABN , First Publish Date - 2023-07-02T17:36:26+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. ఎన్‌సీపీ పేరు, పార్టీ గుర్తు తమవేనని ప్రకటించుకున్నారు. ఎన్‌సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికకు వెళ్తామని చెప్పారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ (Ajit pawar) మరో బాంబు పేల్చారు. ఎన్‌సీపీ పేరు, పార్టీ గుర్తు తమవేనని ప్రకటించుకున్నారు. ఒక పార్టీగానే (NCP) తాను, ఇతర ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికకు వెళ్తామని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. దీంతో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ నిట్టనిలువుగా చీలిన సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి.
రాజకీయ దుమారం..
మహారాష్ట్ర ఎన్‌సీపీలో ఆదివారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు, పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు. ఆ వెంటనే రాజ్‌భవన్‌లో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన మరో 9 మంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు లభించాయి. ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పటేల్ వంటి ఎన్‌సీపీ దిగ్గజాలు కూడా ఇందులో ఉన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో చేరడానికి ముందు అజిత్ పవార్ తన నివాసంలో ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం, ఆ విషయం తనకు తెలియదంటూ శరద్ పవార్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. సమావేశానంతరం నేరుగా తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ రాజ్‌భవన్ చేరుకోవడం, మంత్రివర్గంలో చేరి ప్రమాణస్వీకారం చేయడం చకచగా జరిగిపోయాయి.
విమర్శలను పట్టించుకోం...
కాగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంపై అజిత్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ నిర్ణయంపై కొందరు విమర్శించే వారు అండవచ్చని, అయితే వాటిని తాము పట్టించుకోమని చెప్పారు. మహారాష్ట్ర ప్రగతి కోసం తాము పాటుపడతామని, అందుకోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో చేరడంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారని, ఎన్‌సీపీ పేరుతోనే తాను ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సీపీ పార్టీగానే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో ఎన్‌సీపీ పేరుతోనే తాము పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు.