New Secretariat: కొత్త సచివాలయ భవన నిర్మాణంలో భారీగా అవినీతి

ABN , First Publish Date - 2023-07-25T11:03:13+05:30 IST

కొత్త సచివాలయ భవన నిర్మాణాల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదులపై విచారణ చేపట్టేలా అవినీతి నిరోధక శాఖను ఆదేశించాలని కోరుతూ మద్రాసు

New Secretariat: కొత్త సచివాలయ భవన నిర్మాణంలో భారీగా అవినీతి

- విచారించాలంటూ అన్నాడీఎంకే పిటిషన్‌

పెరంబూర్‌(చెన్నై): కొత్త సచివాలయ భవన నిర్మాణాల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదులపై విచారణ చేపట్టేలా అవినీతి నిరోధక శాఖను ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే(AIADMK) మాజీ ఎంపీ జయవర్ధన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2006-11 మధ్య డీఎంకే హయాంలో స్థానిక ఓమందూర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌లో కొత్త సచివాలయ భవనం నిర్మించారు. వందల కోట్లతో నిర్మించిన ఈ భవనం 2010 మార్చి 13న ప్రారంభించారు. అనంతరం అధికారం చేపట్టిన అన్నాడీఎంకే... కొత్త సచివాలయ భవన నిర్మాణాల్లో అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై విచారణకు మాజీ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో 2011 డిసెంబరులో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు వ్యతిరేకంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి దురైమురుగన్‌ దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన మద్రాసు హైకోర్టు... అన్నాడీఎంకే ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఈ అవకతవలకపై సేకరించిన ఆధారాలు దర్యాప్తు బృందానికి అందించాలని, ఆధారాలుంటే విచారణ చేపట్టాలని 2018లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఈ వ్యవహారంపై విచారణకు అనుమతిస్తూ 2018లో జీవో విడుదలైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎంకే స్టాలిన్‌, దురైమురుగన్‌ దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన మద్రాసు హైకోర్టు(Madras High Court) ఆ జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్‌ ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో, మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే మాజీ ఎంపీ జయవర్ధన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో కొత్త సచివాలయ భవన నిర్మాణాల్లో జరిగిన అవినీతికి సంబంధించి గత 2018 సెప్టెంబరులో ప్రజాపనుల శాఖకు ఫిర్యాదు చేశానని, నాలుగేళ్లుగా ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని, ఏమైనా, 2018లో తాను అందజేసిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే, ఈ వ్యవహారంపై అప్పీలు పిటిషన్‌లో తనను కూడా చేర్చాలని పిటిషన్‌లో కోరారు.

Updated Date - 2023-07-25T11:03:13+05:30 IST