Heavy Rains : ఉప్పొంగుతున్న యమున.. హిమాచల్ ప్రదేశ్‌కు వరద హెచ్చరిక..
ABN , First Publish Date - 2023-07-11T11:12:38+05:30 IST
ఉత్తర భారతం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. యమునా నది 206 మీటర్లకు మించి, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో రహదారులు జలమయంకావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించారు.
న్యూఢిల్లీ : ఉత్తర భారతం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. యమునా నది 206 మీటర్లకు మించి, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో రహదారులు జలమయంకావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 37కు చేరింది.
హిమాచల్ ప్రదేశ్ ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతింది. అకస్మాత్తుగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రెండు రోజుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తర ప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు. ఢిల్లీలోని యమునా నదితోపాటు అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో రోడ్లు జలమయమయ్యాయి, రహదారులు, నివాస ప్రాంతాలు మోకాలి లోతు నీటిలో చిక్కుకున్నాయి. ఆదివారం విపరీతంగా వర్షాలు కురియడంతో అధికార యంత్రాంగం ఈ పరిణామాన్ని నివారించలేకపోయింది.
నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో 39 జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) బృందాలను మోహరించారు. పంజాబ్‌లో పద్నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లో పన్నెండు, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలు పని చేస్తున్నాయి.
అమర్‌నాథ్ యాత్రికులకు ఇబ్బందులు
జమ్మూలో ఏడు వేల మందికిపైగా అమర్‌నాథ్ భక్తులు చిక్కుకుపోయారు. చందేర్‌కోట్ బేస్ క్యాంపు వద్ద 5,000 మందికిపైగా భక్తులు చిక్కుకున్నారు. భక్తులకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు జాతీయ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో కలిసి సమష్టి కృషి చేస్తున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. అయితే భక్తులను జమ్మూ నుంచి కశ్మీరుకు పంపించడం లేదని, అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపేశామని చెప్పారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్లు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లో విధ్వంసం
రాష్ట్రంలోని లహౌల్, స్పీతీలలో సోమవారం దాదాపు 300 మంది పర్యాటకులు, ఇతరులు భారీ వర్షాల్లో చిక్కుకున్నారు. వీరిని సురక్షితంగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. వాతావరణం అనుకూలించిన వెంటనే వారిని విమానాల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు. ఉణ జిల్లాలోని లాల్సింగి మురికివాడలో చిక్కుకున్న 515 మందిని ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు, హోం గార్డులు కాపాడారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు, తాగు నీటికి అంతరాయం కలిగింది. ఈ వరదల వల్ల దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లను మూసివేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. 1,255 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపేశారు. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సిమ్లా-కిన్నౌర్ రోడ్డుపై బండరాళ్లు, కొండచరియలు పడటంతో వాహనాల రాకపోకలను నిషేధించారు.
ఉత్తరాఖండ్‌లో రహదారుల మూసివేత
సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతోపాటు కొండచరియలు విరిగిపడటంతో బదరీనాథ్ జాతీయ రహదారి, మరికొన్ని రోడ్లను మూసివేసినట్లు ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది మరణించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాతావరణ పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని నదుల్లో భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
రాజస్థాన్‌లో జన జీవనం అస్తవ్యస్తం
రాజస్థాన్‌లో ఎడతెరిపిలేని వర్షాల వల్ల సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, రైల్వే ట్రాకులు జలమయమయ్యాయి. ఆసుపత్రుల ప్రాంగణాల్లోకి కూడా నీరు చేరింది. మంగళవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జైపూర్‌లో సోమవారం ఏడేళ్ళ బాలుడు ఓ కాలువలో కొట్టుకుపోయాడు. అజ్మీరులో ముగ్గురు, నాగౌర్‌లో ఇద్దరు, టోంక్‌లో ఒకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్‌లో పాఠశాలలకు సెలవులు
పంజాబ్‌లో జూలై 13 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చండీగఢ్‌లో మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పంజాబ్‌లోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చిక్కుకున్న 910 మంది విద్యార్థులను, మరో 50 మందిని సైన్యం కాపాడింది. హర్యానాలోని చాలా ప్రాంతాలు సోమవారం భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. పంజాబ్, హర్యానాలలో వర్షాల కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలో వాహనదారులకు సూచన
ఢిల్లీలోని గాంధీ నగర్‌లో ఉన్న పుస్త రోడ్డు ఐరన్ బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యమున నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రగతి మైదాన్ సొరంగ మార్గంలో ట్రాఫిక్ కదలికలపై ఆంక్షలు విధించారు. సీ-హెక్సాగాన్, ఇండియా గేట్ సమీపంలో రోడ్డు కోతకు గురైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ అంశాలను గమనించి వాహనదారులు, ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని సలహా ఇచ్చారు. పాత యమున వంతెనపై రైల్ ట్రాఫిక్‌ను నిలిపేసినట్లు నార్తర్న్ రైల్వే తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Nadda : ప్రేమ దుకాణం కాదు.. ‘విద్వేష’ మెగా మాల్
India Vs America : అమెరికాను వెనుకకు నెట్టబోతున్న భారత్ : గోల్డ్‌మన్ శాచెస్