Tejaswi Yadav: ముఖ్యమంత్రి పీఠంపై మనసులోని మాట చెప్పిన తేజస్వి

ABN , First Publish Date - 2023-02-22T18:07:58+05:30 IST

బీహార్‌లోని అధికార జేడీయూ, ఆర్జేడీ కూటమి మధ్య అవగాహనలో భాగంగా సీఎం పదవి మార్పిడి జరగబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి..

Tejaswi Yadav: ముఖ్యమంత్రి పీఠంపై మనసులోని మాట చెప్పిన తేజస్వి

పాట్నా: బీహార్‌లోని అధికార జేడీయూ, ఆర్జేడీ కూటమి మధ్య అవగాహనలో భాగంగా సీఎం పదవి మార్పిడి జరగబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తొందరేమీ తనకు లేదని, నితీష్ కుమార్ సారథ్యంలో మహాకూటమి ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగుతుందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మహా కూటమి ప్రధాన లక్ష్యమని తెలిపారు. సొంత స్వార్థం చూసుకోకుండా మతశక్తుల ఆటలు కట్టించాలనే ఐడియాలజీతోనే తాము ముందుకు వెళ్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏ ఒక్క సీటూ దక్కకుండా ఆర్జేడీ, జేడీయూ గట్టి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

మాంఝీ వ్యాఖ్యలు ఆయన ఇష్టం...

బీహార్ ముఖ్యమంత్రి పదవికి తేజస్వి కంటే తన కుమారుడు సంతోష్ సుమన్‌కు ఎక్కువ అర్హతలున్నాయంటూ జితిన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలపై తేజస్వి స్పందిస్తూ, అది ఆయన కోరిక కావచ్చని, అందులో తప్పు లేదని అన్నారు. ప్రతి తండ్రి తన కొడుకు విజయం కోరుకుంటాడని, మీ కుమారుడు మీ కంటే గొప్పవాడు కావాలని మీరు మాత్రం కోరుకోరా? అని విలేఖరులను తేజస్వి నవ్వుతూ ప్రశ్నించారు.

ఊహాగానాలకు తావిచ్చిన ఆర్జేడీ ఎమ్మెల్యే

కాగా, దీనికి ముందు సీఎం పదవి విషయంలో అధికార మార్పిడి జరిగే అవకాశాలపై ఆర్జేడీ ఎమ్మెల్యే విజయం మండల్ మంగళవారంనాడు సంకేతాలిచ్చారు. నితీష్ కుమార్ తన వాగ్దానానికి కట్టుబడి అధికారాన్ని (సీఎం పదవిని) మార్చిలో తేజస్వికి బదిలీ చేయాలని, 2025 వరకూ (అసెంబ్లీ ఎన్నికలు) తాము వేచిచూడలేమని మండల్ అన్నారు. హోలీ పండుగ లోపు అధికార మార్పిడి జరగవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వేగంగా స్పందించిన జేడీయూ

మండల్ వ్యాఖ్యలపై జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెంటనే స్పందించారు. అధికార మార్పిడి ప్లాన్ గురించి తమకు తెలియదని అన్నారు. ఇరు పార్టీల అగ్రనాయకత్వం అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నట్టు ఆర్జేడీ ఎమ్మెల్యేకి తెలిస్తే ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలని సూచించారు.

Updated Date - 2023-02-22T19:08:50+05:30 IST