Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?
ABN , First Publish Date - 2023-11-14T17:02:54+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi pollution) తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్ (Jaipur)కు తాత్కాలికంగా మకాం మార్చారు. వాయునాణ్యత కలిగిన ప్రాంతానికి తాత్కాలికంగా వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఢిల్లీలో మంగళవారంనాడు వాతావరణ నాణ్యతా సూచీ 375కు చేరింది. ఇది తీవ్రమైన కేటగిరిగా పరిగణిస్తారు. ఇదే నాణ్యతా సూచీ జైపూర్‌లో 72గా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి జైపూర్ వెళ్లి అక్కడి నుంచి బుధవారంనాడు ఛత్తీస్‌గఢ్ వెళ్తారు.
సోనియాగాంధీ గత సెప్టెంబర్‌లో ఫీవర్ లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజు డిశ్చార్జి అయ్యారు. శ్వాససంబంధిత సమస్యలతో గత జనవరిలో కూడా ఇదే ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా సిటీని విడిచి తాత్కాలికంగా బయట ప్రాంతాలకు సోనియాగాంధీ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. 2020 శీతాకాలంలో కూడా ఆమె వైద్యుల సలహా మేరకు గోవా వెళ్లారు.