No Confidence Motion: మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. విపక్షాల ఇండియా కూటమి నిర్ణయం

ABN , First Publish Date - 2023-07-25T12:52:25+05:30 IST

మొత్తం 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి (I.N.D.I.A) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని (No Confidence Motion) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

No Confidence Motion: మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. విపక్షాల ఇండియా కూటమి నిర్ణయం

న్యూఢిల్లీ: మొత్తం 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి (I.N.D.I.A) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని (No Confidence Motion) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇండియా కూటమి పార్టీల సమావేశంలో అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించారు. మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇండియా డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా మల్లికార్జున్ కార్గే ఛాంబర్‌లో జరిగిన ఇండియా కూటమి సమావేశలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై చర్చించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింస సహా అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని విపక్ష నేతలు భావిస్తున్నారు.


‘‘ 83 రోజులుగా ఏమాత్రం తగ్గుదల లేని మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో సమగ్రమైన ప్రకటన చేయాల్సి ఉంది. భయానక హింసకు సంబంధించిన కథనాలు నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. మణిపూర్ హింసపై మోదీ ప్రభుత్వం సమాధానానికి ఇండియా (I.N.D.I.A) డిమాండ్ చేస్తోంది.

ఈశాన్య భరతంలో పరిస్థితులు చాలా సున్నితంగా మారాయి. మణిపూర్ హింసాత్మక పర్యవసనాలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించేలా కనిపిస్తున్నాయి. సరిహద్దులను పంచుకునే సున్నితాత్మాక రాష్ట్రాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రధాని మోదీ అహాన్ని పక్కనపెట్టి.. దేశానికి మణిపూర్‌‌పై నమ్మకం కల్పించాలి’’ అని మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.

Updated Date - 2023-07-25T13:10:53+05:30 IST