OPS category: ఆ తీర్మానాలను రద్దు చేయండి
ABN , First Publish Date - 2023-03-04T11:52:13+05:30 IST
గత జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ
- మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ఓపీఎస్ వర్గం
- నిరాకరించిన న్యాయమూర్తి
- తదుపరి విచారణ 17కు వాయిదా
పెరంబూర్(చెన్నై): గత జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ఆదిలోనే చుక్కెదురైంది. ఆ సమావేశంలో చేసిన తీర్మానాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అన్నాడీఎంకే(AIADMK) సర్వసభ్య సమావేశం గత ఏడాది జూలై 11వ తేదీన జరగ్గా, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఎంపికైన విషయం తెలిసిందే. అలాగే ఓపీఎస్ సహా ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించారు. దీంతో సర్వసభ్య మండలి తీర్మానాలను వ్యతిరేకిస్తూ ఓపీఎస్ తరఫున దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశ తీర్మానాలు చెల్లవని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించగా, ఆనక ద్విసభ్య ధర్మాసనం ఆ సమావేశ తీర్మానాలు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. దాంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ వర్గీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం, అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం చెల్లుబాటవుతుందని స్పష్టం చేస్తూ, అయినా ఆ తీర్పును వ్యతిరేకిస్తూ హక్కుల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అందుకు మద్రాసు హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం రద్దు చేయాలని కోరుతూ ఓపీఎస్ తరఫున ఎమ్మెల్యే మనోజ్ పాండ్యన్ మద్రాసు హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలుచేశారు. గత ఏడాది జూలై 11వ తేది నిర్వహించిన సర్వసభ్య మండలి సమావేశంలో ఒ.పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, జేసీడీ ప్రభాకర్, తనతో పాటు పలువురు నిర్వాహకులను పార్టీ నుంచి తొలగించడంతో పాటు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎంపిక చేస్తూ తీర్మానించారని పిటిషన్‌లో తెలిపారు. అలాగే, సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులను కూడా తొలగిస్తూ తీర్మానం నెరవేర్చారని పేర్కొన్నారు. ఈ తీర్మానాలపై స్టే విధించాలని ఎమ్మెల్యే మనోజ్ పాండ్యన్ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం మద్రాసు హైకోర్టు(Madras High Court) న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ముందు విచారణ జరిగింది. మనోజ్ పాండ్యన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గురు కృష్ణన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుతో తాము శాసనసభ సమావేశాల్లో పాల్గొనలేని పరిస్థితి నెలకొందని, అందువల్ల తక్షణం ఆ తీర్మానాలపై స్టే విధించాలని అభ్యర్థించారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ప్రతివాదుల తరఫు వాదనలు వినయకుండానే తీర్మానాలపై ఎలా స్టే విధిస్తామని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్వసభ్య మండలి తీర్మానాలపై స్టే విధించలేమని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లోపు పళనిస్వామి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.