Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..

ABN , First Publish Date - 2023-08-23T12:06:50+05:30 IST

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, మదర్సాలాలో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విద్యార్థులు కూడా చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పలు పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సరైన సౌకర్యాలు లేవని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులు లేఖ రాశారు. పాఠశాలల్లో టెలివిజన్‌లు, డిష్‌లు, యాంటెనాలు లేవని, అవి లేకుండా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడం సాధ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల తర్వాతి వరకు విద్యార్థులను తమ వద్ద ఉంచుకోవడం సాధ్యపడదని కూడా ఉపాధ్యాయులు లేఖలో పేర్కొన్నారు.


ఇక చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో(ISRO) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - 2023-08-23T12:06:50+05:30 IST