మా ఉపనేత ఉదయకుమార్.. ఆయనకు ముందు వరుసలో సీటివ్వాల్సిందే..
ABN , First Publish Date - 2023-04-11T07:59:26+05:30 IST
తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఎన్నికైన మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్(Former Minister RB Udayakumar)కు ప్రతిపక్షనేత
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఎన్నికైన మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్(Former Minister RB Udayakumar)కు ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి పక్కనే సీటు కేటాయించాలంటూ అన్నాడీఎంకే చేసిన డిమాండ్ కొద్దిసేపు శాసనసభలో గందరగోళం సృష్టించింది. దీనిపై మాట్లాడేందుకు తమ నేత ఎడప్పాడి పళనిస్వామికి స్పీకర్ అప్పావు(Speaker Appau) తగిన సమయం కేటాయించలేదంటూ చివరికి అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే అన్నాడీఎంకే సభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని సభలో కీలకమైన తీర్మానాలు ప్రవేశపెట్టనుండటంతో మాట్లాడేందుకు అనుమతించలేమని చెప్పారు. మంగళవారం సభలో మాట్లాడేందుకు అనుమతిస్తామని చెప్పారు. వెంటనే అన్నాడీఎంకే(AIADMK) సభ్యులంతా మూకుమ్మడిగా లేచి ఈపీఎస్ను మాట్లాడేందుకు అనుమతించాలంటూ కేకలు పెట్టారు. దీంతో ఈపీఎస్ను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. ఈ సందర్భంగా ఈపీఎస్ మాట్లాడుతూ... అన్నాడీఎంకే(AIADMK) సభాపక్ష ఉపనాయకుడిగా ఎంపికైన ఆర్బీ ఉదయకుమార్‌కు ముందువరుసలో సీటు కేటాయించాలంటూ ఎన్నిమార్లు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేత, ఉపనేత ఒకే వరుసలో పక్కపక్కనే కూర్చోవడం ఆనవాయితీ అని, అయితే ఈ విషయమై స్పీకర్‌ను అడిగితే పదేపదే ఆ అంశం పరిశీలనలో ఉందంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడిగా ఉదయకుమార్ ఎంపికయ్యారని, అయినా స్పీకర్ ముందువరుసలో సీటు కేటాయించడం లేదన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తన పదవిని గుర్తిస్తూ తీర్పులు వెలువరించాయన్నారు. వెంటనే స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని సభలో సభ్యులకు సీటు కేటాయించే విషయం తన పరిధిలోని అంశమని, కోర్టు తీర్పులతో సంబంధం లేదని బదులిచ్చారు. డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే ఉన్నప్పుడు దురైమురుగన్ సభాపక్ష ఉపనేతగా స్టాలిన్ పక్కనే కూర్చునేవారని, ఇప్పుడు తాము కూడా ఆ విధంగానే కోరుతున్నామని గుర్తు చేశారు. అంతేగాక సభలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అంశాలపై టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదన్నారు. డీఎంకే(DMK) ఎన్నికల మేనిఫెస్టోలో శాసనసభ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించినా నెరవేర్చలేదని విమర్శించారు. ఇంకా ఆయన ప్రసంగం కొనసాగిస్తుండగా స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఈపీఎస్ ప్రకటించారు. దీంతో సభ నుంచి అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. వెంటనే దురైమురుగన్ లేచి సభా నిబంధనలను గతంలో సడలించినవారంతా ప్రస్తుతం ఆ నిబంధనలు సడలించనున్నారనే విషయం ముందే పసిగట్టి వాకౌట్ చేశారని విమర్శించారు.