Pakistan Crisis : మంత్రివర్గ సమావేశంలో కరెంట్ బల్బు వెలిగించుకోలేని దుస్థితిలో పాకిస్థాన్!
ABN , First Publish Date - 2023-01-07T12:56:49+05:30 IST
సూర్యుని వెలుగులో మంత్రివర్గ సమావేశాలు, ప్లాస్టిక్ బెలూన్లలో వంటగ్యాస్ నిల్వ... ఇదీ పాకిస్థాన్ దుస్థితి. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు,
ఇస్లామాబాద్ : సూర్యుని వెలుగులో మంత్రివర్గ సమావేశాలు, ప్లాస్టిక్ బెలూన్లలో వంటగ్యాస్ నిల్వ... ఇదీ పాకిస్థాన్ దుస్థితి. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు స్వయంకృతాపరాధాలు 23 కోట్ల జనాభాను వెంటాడుతున్నాయి. చాలా కాలం నుంచి ఆర్థికంగా దెబ్బతిన్న ఆ దేశంలో ప్రస్తుతం ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. ప్రధాన నగరాల్లో గోధుమ పిండి, పంచదార, నెయ్యి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజా జీవనం అల్లకల్లోలమవుతోంది.
కొండంత అప్పు, దిగుమతి చేసుకుంటున్న ఇంధనం ధరల పెరుగుదల, విదేశీ మారక ద్రవ్యం అడుగంటడం, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత్వం, జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) పెరుగుదల క్షీణత వంటివన్నీ పాకిస్థాన్‌ను కబళిస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదం బుసలు కొడుతోంది. దీంతో ప్రజలను కాపాడేందుకు, దేశం కుప్పకూలకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కాలంతో పరుగులు తీయవలసి వస్తోంది.
అమెరికాలోని తన ఎంబసీ ఆస్తిని పాకిస్థాన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వేలానికి పెట్టింది. పాకిస్థాన్ పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. ఆ దేశంలో అత్యధిక జనాభాగల నగరాల్లో రెండో స్థానంలో ఉన్న లాహోర్‌లో అత్యధిక దుకాణాల్లో గోధుమ పిండి మచ్చుకైనా కనిపించడం లేదు. కొద్ది దుకాణాల యజమానులు 15 కేజీల గోధుమ పిండిని రూ.2,050కి (పాకిస్థాన్ కరెన్సీ) అమ్ముతున్నారు. దీని ధర రెండు వారాల్లో రూ.300 పెరిగింది. అదేవిధంగా రాజధాని నగరం ఇస్లామాబాద్, దేశంలో నాలుగో అతి పెద్ద నగరం రావల్పిండిలలో రెండు రోజుల్లోనే ఈ పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. 15 కేజీల గోధుమ పిండి బస్తా ధర రెండు రోజుల్లో రూ.40 పెరిగి రూ.1,915కు చేరింది. ఈ దారుణానికి కారణం ఆహార శాఖ, ఫ్లోర్ మిల్లుల మధ్య సమన్వయలోపమేనని ఆరోపణలు వస్తున్నాయి. వంట గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ధర రూ.10,000కు, కేజీ చికెన్ ధర రూ.650కి చేరింది.
ధరల పెంపు
మరోవైపు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ ద్వారా విక్రయించే గోధుమ పిండి, పంచదార, నెయ్యి ధరలను 25 శాతం నుంచి 62 శాతం వరకు పెంచింది. రాయితీల భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
అడుగంటిన విదేశీ మారక ద్రవ్యం
విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఎనిమిదేళ్ళ కనిష్ట స్థాయికి తగ్గిపోయాయి. రుణాల తిరిగి చెల్లింపుల కోసం 245 మిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థానీ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు భారీగా పతనమైంది. జనవరి 5న ఒక అమెరికన్ డాలర్ విలువ రూ.227.12కు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశం వృద్ధి రేటు 3 నుంచి నాలుగు శాతం కన్నా తక్కువగా ఉండవచ్చునని పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
యువత భవిత?
పాకిస్థాన్‌లో నిరుద్యోగం గురించి చెప్పాలంటే, ఇస్లామాబాద్‌లో 1,667 పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు 30,000 మంది హాజరయ్యారు. నగరంలోని అతి పెద్ద స్టేడియానికి వీరంతా పోటెత్తారు. నగరంలో నివసించేవారు మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు నగరాల్లో నివసించేవారు కూడా ఈ ఉద్యోగాల కోసం వచ్చారు. ఈ ఖాళీలు ఐదేళ్ళ నుంచి భర్తీ కాలేదని అధికారులు చెప్తున్నారు. పాకిస్థాన్ జనాభాలో 30 ఏళ్ళలోపు వయసుగలవారు 60 శాతం మంది ఉన్నారు. వీరిలో 31 శాతం మంది నిరుద్యోగులు. వీరిలో 51 శాతం మంది పురుషులు కాగా, 16 శాతం మంది మహిళలు.
నేతల వింత వ్యాఖ్యలు
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ జనవరి 5న విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాత్రి 8 గంటలకల్లా మార్కెట్లను మూసేసిన ప్రాంతాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉందన్నారు. ఈ వింత వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విద్యుత్తును ఆదా చేయాలనే లక్ష్యంతో రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసేయాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు
- మార్కెట్లను ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకల్లా మూసేయాలి. రెస్టారెంట్లను రాత్రి 10 గంటలకు మూసేయాలి. కల్యాణ మండపాలను త్వరగా మూసేయాలి.
- ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలి.
- ఎక్కువ విద్యుత్తును వినియోగించే పంకాలు (electric fans) ఉత్పత్తిపై జూలై నుంచి నిషేధం.
- ఇన్‌కాండెసెంట్ బల్బుల ఉత్పత్తిపై వచ్చే నెల నుంచి నిషేధం.
- కోనికల్ గీజర్ల వాడకం తప్పనిసరి. వీథి దీపాలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలి.
- నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడం కోసం నీటి ధరలను అధికారులు సమీక్షించాలి.
- కార్యాలయాల్లో విద్యుత్తు ఉపకరణాలను అనవసరంగా వాడకూడదు.
- వర్క్ ఫ్రం హోం పాలసీ త్వరలో.
ఈ చర్యల వల్ల దేశానికి రూ.62 బిలియన్లు (274 మిలియన్ డాలర్లు) ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అంతర్జాతీయ సహాయం
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అనేక సంవత్సరాల నుంచి ఒడుదొడుకుల్లో ఉంది. దీని నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) 2019లో 6 బిలియన్ డాలర్ల ఉద్దీపన సహాయం చేసింది. గత ఏడాది ఆగస్టులో మరొక 1.1 బిలియన్ డాలర్ల సహాయం పొందింది. మరో 1.1 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ విడుదల ఆలస్యమైందంటూ, దాని కోసం మళ్లీ ఐఎంఎఫ్‌తో ప్రభుత్వం చర్చిస్తోంది.
కుదిపేసిన వరదలు
గత ఏడాది సంభవించిన వరదల వల్ల పాకిస్థాన్‌కు 40 బిలియన్ డాలర్ల మేరకు నష్టం జరిగినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దాదాపు 80 లక్షల మంది ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ, దాదాపు రెండు కోట్ల మంది వరద బాధితులు ఇప్పటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
కొసమెరుపు
- మంత్రివర్గ సమావేశాన్ని సూర్యుని వెలుగులో నిర్వహించామని, విద్యుత్తు దీపాలను వెలిగించలేదని రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు.
- ప్రజలు వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ బెలూన్లు, బ్యాగుల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఖైబర్ పష్తూన్ (Khyber Pakhtunkhwa)లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది.