India Vs Pakistan : ఎల్ఓసీని దాటగలమన్న రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-07-27T13:17:04+05:30 IST

భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.

India Vs Pakistan : ఎల్ఓసీని దాటగలమన్న రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆగ్రహం

ఇస్లామాబాద్ : భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఎలాంటి దురాక్రమణ నుంచి అయినా తనను తాను కాపాడుకోగలిగే సత్తా తమకు సంపూర్ణంగా ఉందని తెలిపింది.

కార్గిల్ విజయోత్సవాల సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ద్రాస్‌లో మాట్లాడుతూ, భారత దేశ సమగ్రత, ఐకమత్యం, సార్వభౌమాధికారాలను పరిరక్షించుకోవడం కోసం రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. దేశ శత్రువులను నిర్మూలించేందుకు రక్షణ దళాలకు స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. దేశ గౌరవ, ప్రతిష్ఠలకు కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధమేనని చెప్పారు. ఎల్ఓసీని దాటి వెళ్లడానికైనా సిద్ధమేనని తెలిపారు. తమను రెచ్చగొడితే, అవసరం ఉత్పన్నమైతే, తాము ఎల్ఓసీని దాటి వెళతామన్నారు. భారత దేశం శాంతికాముక దేశమని, శతాబ్దాలనాటి విలువలకు కట్టుబడి ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు. కానీ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎల్ఓసీని దాటి వెళ్లడానికి సంకోచించేది లేదన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత దేశం గెలిచినప్పటికీ, ఎల్ఓసీని దాటి వెళ్లకపోవడానికి కారణం ఈ విలువలను పాటించడమేనని వివరించారు.


ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం స్పందిస్తూ, భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారతదేశానికి నచ్చజెప్తున్నామని తెలిపింది. దక్షిణాసియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని రాజ్‌నాథ్ వ్యాఖ్యలు అస్థిరపరుస్తాయని ఆరోపించింది. కశ్మీరు, గిల్గిట్-బాల్టిస్థాన్‌ల గురించి భారతీయ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదని వ్యాఖ్యానించింది.

1999లో కార్గిల్‌లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే జూలై 26న కార్గిల్ విజయోత్సవాలను మన దేశంలో నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

Updated Date - 2023-07-27T13:17:04+05:30 IST