Poisonous snake remarks: మే 10న జనమే సమాధానమిస్తారు: మోదీ

ABN , First Publish Date - 2023-04-30T15:34:17+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'విషపు నాగు' వ్యాఖ్యల దుమారం..

Poisonous snake remarks: మే 10న జనమే సమాధానమిస్తారు: మోదీ

కోలార్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో 'విషపు నాగు' (Poisonous Snake) వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే దీనికి సరైన సమాధానం చెబుతారని కర్ణాటకలో రెండోరోజు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోలార్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ కాలం చెప్పిన ఇంజిన్ అని, ఆ పార్టీ కారణంగానే అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లెక్కకు మిక్కిలిగా తప్పుడు హామీలు ఇస్తుంటుందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోదని, అదే వారి రికార్డని విమర్శించారు. బీజేపీ ఇందుకు భిన్నంగా అభివృద్ధి పనుల కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని అన్నారు.

85 శాతం కమిషన్ల పార్టీ...

కాంగ్రెస్ హయాంలో అవినీతి పరిఢవిల్లుతుందని, బీజేపీ మాత్రం అవినీతిపై చర్యలు తీసుకుంటుందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌కు 85 శాతం కమిషన్ల పార్టీ అనే గుర్తింపు ఉందని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వాలపై నమ్మకం లేదని చెప్పారు. ''కాంగ్రెస్ ప్రధాని ఒకరు రూపాయి పంపుతామన్నారు. కానీ ప్రజలకు చేరింది 15 పైసలే. ఆ పార్టీ ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతుంటుంది. బీజేపీ అలాకాదు. బుజ్జిగింపు రాజకీయాలు చేయదు, సంతృప్తికరమైన రాజకీయాలు చేస్తుంది. అవినీతి నీడనే కాంగ్రెస్ పెరిగింది. బీజేపీ మాత్రమే అవినీతిపై చర్యలు తీసుకుంటుంది'' అని మోదీ అన్నారు.

రైతులకు చేసిందేమీ లేదు...

రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మోదీ విమర్శించారు. ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. బీజేపీ రైతులకు రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని, వారి అకౌంట్లలో ఆ మొత్తం వేసిందని చెప్పారు. కాంగ్రెస్ పేదలను నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ రైతుల నిరంతర అభివృద్ధికి పాటుపడుతోందని తెలిపారు.

అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్, జేడీఎస్

కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయని, ఆ పార్టీలు రెండూ అభివృద్ధి నిరోధకులని విమర్శించారు. అస్థిర ప్రభుత్వానికి 'విజన్' అనేది ఉండదన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని, నిరంతర అభివృద్ధికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం చాలా కీలకమని అన్నారు. జేడీఎస్ హయాంలో అభివృద్ధి మందగించిందని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి నుంచి కర్ణాటకను కాపాడుకోవాలని అన్నారు. ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికల చివర విడత ప్రచారంలో భాగంగా పలు రోడ్‌షోలలోనూ మోదీ పాల్గొంటున్నారు. మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-04-30T15:34:17+05:30 IST