Piyush Goyal: ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. విపక్ష నేతలపై పీయూష్ గోయల్ ‘ప్రాంక్’?
ABN , First Publish Date - 2023-11-01T15:17:44+05:30 IST
మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...
మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు మరికొంతమంది నేతలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్టేట్-స్పాన్సర్డ్’ హ్యాకర్లతో తమ ఫోన్లను హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. అయితే.. ఈ ఆరోపణల్ని తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. అంతేకాదు.. విపక్ష నేతల్ని ఎవరైనా ఆట పట్టించి ఉంటారంటూ ఛలోక్తులు పేల్చారు.
‘‘బహుశా ప్రతిపక్ష నాయకులపై ఎవరైనా సరదాగా ప్రాంక్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వాళ్లు (ప్రతిపక్ష నేతల్ని ఉద్దేశిస్తూ) ఆరోపణలు చేయడం పక్కన పెట్టేసి అధికారికంగా ఫిర్యాదు చేయాలి. దాని ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పీయూష్ గోయల్ చెప్పారు. అంతేకాదు.. ప్రతిపక్షాలు ప్రస్తుత బలహీన దశలో ఉన్నాయని, అందుకే ప్రతీ విషయంలోనూ కుట్రకోణాన్ని చూస్తున్నారంటూ చురకలంటించారు. నిజానికి.. ఇది ఒక విధమైన లోపమని స్వయంగా యాపిల్ సంస్థ వెల్లడించిందని గుర్తు చేశారు. ఈ హ్యాకింగ్ అలర్ట్ కేవలం విపక్ష నేతలకు కాదు, 150 దేశాల్లోని ప్రజలకు చేరినట్టు ఆ సంస్థ తెలిపిందన్నారు. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు చురుగ్గా ఉన్నారని స్పష్టమవుతోందన్నారు. దీనిపై తాము విచారణ జరుపుతామని, యాపిల్ సంస్థని కూడా సహకరించాలని కోరామని ఆయన స్పష్టం చేశారు.
ఈ హ్యాకింగ్ అలర్ట్ వివాదంలో ప్రతిపక్షాలు ఎలాంటి వాదనలైనా చేసుకోవచ్చని, కానీ వారి పరిస్థితి ఏంటో దేశానికి తెలుసని పీయూష్ గోయల్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం విపక్షాల మధ్యే అంతర్గత పోరు సాగుతోందని, నేతలందరూ ఆ పోరులో చిక్కుకుపోయారని, తమపై ఆరోపణలు చేయడానికి ముందు వాళ్లు తమ బలహీనతల్ని చూసుకోవాలని హితవు పలికారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని, అసలు ప్రభుత్వానికి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా.. ఈ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ పెద్ద వివాదానికి తెరలేపిన తరుణంలో యాపిల్ సంస్థ దీనిపై స్పందించింది. ఇది ఒక నకిలీ నోటిఫికేషన్ అయ్యుండొచ్చని, ‘స్టేట్-స్పాన్సర్డ్’ హ్యాకర్ల పని కాదని క్లారిటీ ఇచ్చింది. అయితే.. ఈ అలర్ట్ నోటిఫికేషన్ ఎందుకొచ్చిందన్న రహస్యాన్ని మాత్రం ఆ సంస్థ బయటపెట్టకపోవడం గమనార్హం.