Uttarakhand tunnel rescue op: ఆగర్ మిషన్ దెబ్బతినడంతో హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్
ABN , First Publish Date - 2023-11-25T17:19:35+05:30 IST
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మిషన్‌కు ఇనుపపట్టీ అడ్డుపడటం, మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో హైదరాబాద్ నుంచి కట్టర్‌ను రప్పిస్తున్నారు.
ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగం (Uttarkashshi)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మిషన్‌కు ఇనుపపట్టీ అడ్డుపడటం, మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి హుటాహుటిన ప్లాస్మా కట్టర్ (Plasma cutter)ను రప్పిస్తున్నారు. సహాయక చర్చలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.
శిథిలాలను డ్రిల్లింగ్ ద్వారా తొలగించి కార్ముకులను పైపుల ద్వారా రప్పించేందుకు జరుగుతున్న సహాయక చర్యల్లో చాలా సంక్లిష్టంగా, సవాలుగా ఉన్నట్టు సీఎం చెప్పారు. చాలా దగ్గర వరకూ వెళ్లి మిషన్ నిలిచిపోయిందని, ఆగర్ మిషన్ బ్లేడ్లను కట్ చేసేందుకు ప్లాస్మా కట్టర్‌ను వినియోగించాల్సి ఉందని తెలిపారు. దీనిని హైదరాబాద్ నుంచి విమానమార్గంలో రప్పిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఉదంయ మ్యాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
సొరంగంలో చిక్కుకున్న వర్కర్లతో తాను మాట్లాడానని, వారు ఎంతో మనోనిబ్బరంతో ఉన్నారని సీఎం చెప్పారు. ''కార్మికులు గబ్బర్ సింగ్, సాభా అహ్మద్, షరియా మిశ్రా అనే వారితో ఇప్పుడే నేను మాట్లాడాను. వాళ్లంతా చాలా నిబ్బరంగా ఉన్నారు. తామంతా బాగున్నామని, సకాలంలో ఆహారం అందుతోందని చెప్పారు. సమయం పట్టినా అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకురావాలని వారు కోరారు'' అని పుష్కర్ సింగ్ థామీ చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ పూర్తి పూర్తి కావాలని తామంతా కోరుకుంటున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తమ సంస్థలు, ప్రజలంతా కూడా పూర్తి శక్తిసామర్థ్యాలతో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని సీఎం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారని, ప్రతిరోజూ పరిస్థితిని అడిగితెలుసుకుంటున్నారని తెలిపారు. కాగా, కొండపై నుంచి మనుషులతో నిలువుగా డ్రిల్లింగ్ చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎన్)కు చెందిన 12 మంది సభ్యుల బృందాన్ని కూడా సిద్ధం చేశారు. వర్టికల్ డ్రిల్లింగ్ అవకాశంపై ఎస్‌జేవీఎన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. 5,6 రోజుల్లో వర్టికల్ డ్రిల్లింగ్ చేసే ఒక ప్రతిపాదనను ప్రభుత్వయంత్రాగం ముందు ఉంచామని, డ్రిల్లింగ్ మిషన్లను కూడా ఘటనా స్థలి వద్ద మోహరించామని, తమకు ఆదేశాలు రాగానే రంగంలోకి దిగుతామని ఎస్‌జేవీఎన్ అధికారి ఒకరు తెలిపారు.