Independence Day : ఎర్ర కోట ప్రసంగంలో మోదీ కీలక హామీలు..

ABN , First Publish Date - 2023-08-15T15:54:01+05:30 IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ముఖ్యమైన హామీలు ఇచ్చారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, వృత్తి నైపుణ్యంగల యువత కోసం ప్రత్యేక పథకాలు వంటివాటిని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

Independence Day : ఎర్ర కోట ప్రసంగంలో మోదీ కీలక హామీలు..
Narendra Modi

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రజలకు ముఖ్యమైన హామీలు ఇచ్చారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, వృత్తి నైపుణ్యంగల యువత కోసం ప్రత్యేక పథకాలు వంటివాటిని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు ఈ సభలో పాల్గొన్నారు.

విశ్వకర్మ పథకం

వచ్చే నెల నుంచి విశ్వకర్మ పథకాన్ని రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. క్షురక వృత్తి, బట్టలు ఉతకడం, బంగారు ఆభరణాలు తయారు చేయడం వంటి సంప్రదాయ నైపుణ్యాలుగలవారికి ఈ పథకం క్రింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

చౌక ధరకు మందులు

జన ఔషధి కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని తన ప్రభుత్వం ప్రణాళిక రచించిందని చెప్పారు. జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. మధుమేహ రోగగ్రస్థులు నెలకు రూ.3,000 వరకు ఖర్చు చేయవలసి వస్తోందని, రూ.100 విలువైన మందులు జన ఔషధి కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.15కే అందుబాటులో ఉంటాయని చెప్పారు.


సొంతింటి కల

పట్టణాలు, నగరాల్లో తమకు ఓ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటున్నవారి కోసం తన ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెడుతోందన్నారు. నగరాల్లో నివసిస్తూ, సొంత ఇల్లు లేని మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాల్లో ఉపశమనం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

దేశ ఆర్థికాభివృద్ధి

తాను 2014లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉండేదని, నేడు అది ఐదో స్థానానికి వృద్ధి చెందిందని, రానున్న ఐదేళ్లలో ఇది ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.

ధరాభారం పడకుండా..

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందు వల్ల ప్రజలపై ధరల భారం అతి తక్కువగా ఉండేలా చూడటం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలో తన ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించిందని చెప్పారు. ఈ కృషి కొనసాగుతుందన్నారు.


లక్షాధికారులుగా మహిళలు

మహిళా స్వయం సహాయక బృందాల కృషిని మోదీ ప్రశంసించారు. రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది తన కల అని చెప్పారు. నేడు మహిళా స్వయం సహాయక బృందాల్లో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు ఉన్నారని, మహిళలు శాస్త్రవేత్తలు అవుతున్నారని చెప్పడం గర్వంగా ఉందని చెప్పారు. చంద్రయాన్ కార్యక్రమానికి మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయన్నారు.

వరుసగా పదోసారి..

ఎర్ర కోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. ఈసారి ఆయన దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించారు. ‘‘పరివార్‌జన్’’ (కుటుంబ సభ్యులు) అని సంబోధిస్తూ ప్రసంగించారు. గతంలో ఆయన దేశ ప్రజలను ‘‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా’’ అని సంబోధించేవారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన సరికొత్త రకం తలపాగా, దుస్తులు ధరించారు. వర్ణరంజితమైన రాజస్థానీ బంధని ప్రింట్ తలపాగాను, ఆఫ్-వైట్ కుర్తా, V-నెక్ జాకెట్, చుడీదార్‌లను ధరించారు. తలపాగా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంది. దీనికి పొడవైన వస్త్రం వేలాడుతూ ఉంది.


ఇవి కూడా చదవండి :

Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ

Independence Day : మధ్య తరగతి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి : మోదీ

Updated Date - 2023-08-15T16:37:00+05:30 IST